UP Assembly Election 2022: యూపీలో దూసుకుపోతున్న అఖిలేష్ యాద‌వ్‌.. 300 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ !

By Mahesh RajamoniFirst Published Jan 18, 2022, 10:44 PM IST
Highlights

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ద రాజ‌కీయాలు రస‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా దూసుకుపోతోంది మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ. ఇక ఓట‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డానికి ఉచిత విద్యుత్ అస్త్రాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు అఖిలేష్‌. 
 

UP Assembly Election 2022: వ‌చ్చే  నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో యూపీ రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్‌, రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్.. త‌న‌దైన స్టైల్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తూ.. ముందుకు సాగుతున్నారు. అధికార పీఠం ద‌క్కించుకోవ‌డ‌మే లక్ష్యంగా ప‌క్కా ప్రణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్న‌ట్టుగా తెలుస్తున్న‌ది. అధికార పార్టీ బీజేపీకి బ‌ల‌మైన పోటీదారుగా నిలుస్తూ.. క‌మ‌లం మ‌ళ్లీ విక‌సించ‌కుండా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఓట‌ర్ల‌ను స‌మాజ్ వాదీ పార్టీ వైపు తిప్పుకోవ‌డానికి ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని తెర మీద‌కు తీసుకువ‌చ్చారు. 

ఫిబ్రవరి 10 నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచిన స‌మాజ్ వాదీ పార్టీ.. ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డం కోసం ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను గృహ వినియోగదారులకు అందిస్తామ‌ని ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. ఇదే అంశాన్ని ఓట‌ర్ల‌లోకి తీసుకుపోవ‌డానికి సమాజ్‌వాదీ పార్టీ ఇంటింటికీ ప్రచారాన్ని ప్రారంభించనుందని అఖిలేష్ యాదవ్  మంగళవారం నాడు వెల్ల‌డించారు. రాబోయే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధిస్తే  ఉచిత విద్యుత్ కోసం కొత్త పథకాన్ని అమలు చేస్తామని అఖిలేష్ యాదవ్ వివరించారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం స‌మాజ్ వాదీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తుందని, గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు నీటిపారుదల కోసం ఉచిత విద్యుత్ అనేది"నంబర్ వన్ వాగ్దానం" అని అఖిలేష్ యాద‌వ్ అన్నారు. 

మంగళవారం లక్నోలోని స‌మాజ్ వాదీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాద‌వ్.. ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని తీసుకువ‌స్తామ‌నీ,  “స్కీమ్ ప్రయోజ‌నాలు పొందేందుకు ఫారమ్‌లను నింపేటప్పుడు, దరఖాస్తుదారులు తమ విద్యుత్ బిల్లులో పేర్కొన్న విధంగానే పేరును నింపాలి” అని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఈ ప్రచారానికి "300 యూనిట్ బిజిలీ పావో, నామ్ లిఖావో, చూట్ నా జావో" (300 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందండి....మీరే నమోదు చేసుకోండి) అని పేరు పెట్టారు.  బుధవారం నుండి ఈ ప్రచారానికి సంబంధించిన ఫారమ్‌లను నింపడానికి పార్టీ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌లో ఇంటింటికీ తిరుగుతారని అఖిలేష్ యాద‌వ్ చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన పార్టీ మేనిఫెస్టోలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, వ్యాపారులు,  రైతుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్లు అఖిలేష్ యాదవ్ తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమవుతాయి.  మొత్తం 403 స్థానాలకు ఏడు దశల్లో  ఎన్నిక‌లు నిర్వహించబడతాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో ఓటింగ్ నిర్వహించగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 
 

click me!