
ఆయన 20 ఏళ్ల పాటు ఆటో నడిపాడు. ఆటో డ్రైవర్ (auto driver) గా పని చేస్తూ వచ్చిన ఆ రోజు వారి డబ్బులతోనే తన కుటుంబ బాధ్యతలు మోసేవారు. కానీ ఒక్క సారిగా ఆయన తలరాత మారియింది. ఓ కార్పొరేషన్ మేయర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదీ కూడా ఓ కొత్త కార్పొరేషన్ కు మొదటి మేయర్ గా ఎన్నికవడం అంటే మామూలు విషయం కాదు. కష్టపడేతత్వం, అందరికీ మంచి చేయాలనే ఉద్దేశం, నమ్ముకున్న విలువలపై నిలబడే తత్వం ఉంటే విజయం ఏరోజుకైనా చేకూరుతుందని చెప్పడానికి ఆయన ఓ ఉదాహరణ. ఇంతకీ ఎవరు ఆయన ? ఏమిటి ఆయన కథ ? తెలుసుకోవాలంటే పూర్తిగా చదవాల్సిందే.
తమిళనాడు (tamil nadu)లోని తంజావూరు (thanjavur) జిల్లాలోని కుంభకోణం (kumbakonam) పట్టణానికి చెందిన కె. శరవణన్ (K Saravanan) ఓ సాధారణ ఆటో డ్రైవర్. ఆయన వయస్సు 42. దాదాపు 20 ఏళ్లుగా ఆటో నడుపుతున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో 17వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేశారు. పోలింగ్‌లో మొత్తం 2,100 ఓట్లకు గాను 964 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు.
తమిళనాడులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డీఎంకే (dmk) విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ 21 కార్పొరేషన్లలో 20 కార్పొరేషన్లకు మేయర్లను ఎంపిక చేసింది. ఒక్క కార్పొరేషన్ మేయర్ పదవిని కాంగ్రెస్ (congress)కు కేటాయించింది. అదే కొత్తగా ఏర్పడిన కుంభకోణం మున్సిపల్ కార్పొరేషన్. అయితే ఆ పదవిని ఓ సీనియర్ లీడర్ అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ శరవణన్‌ను ఆ పదవికి ఎంపిక చేసింది. దీంతో చాలా మంది కాంగ్రెస్ ప్రముఖులు ఆయనను ట్విట్టర్ లో అభినందించారు. నిరాడంబరమైన నేపథ్యం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసినందుకు పార్టీని కొనియాడారు.
ఆయన ఎంపికైన తీరు, ఆ సమయంలో ఆయన పొందిన అనుభూతిని ఆయన ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు.“ తంజావూరు నార్త్ కాంగ్రెస్ కమిటీ జిల్లా నాయకుడు టీఆర్ లోగనాథన్ నన్ను జిల్లా కార్యాలయానికి రమ్మని పిలిచారు. నీకొక సర్ప్రైజ్ ఉందని చెప్పారు. నాకు ఏం అర్థం కాలేదు. నేను ఆఫీసుకు వెళ్లాను. అక్కడికి చేరుకోగానే.. ‘కుంభకోణం మొదటి మేయర్‌కి స్వాగతం’ అంటూ ఆయన స్వాగతం పలికారు. నేను ఆశ్చర్యపోయాను. కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉండటంతో ఈ విషయం నేను అస్సలు ఊహించలేదు. ’’ అంటూ ఆయన ఆనందపడుతూ చెప్పారు.
“ నేను కేవలం ఆటోడ్రైవర్‌నేని. కానీ మా నాయకుడు నాకు మేయర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పారు. పార్టీ నన్ను అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. తరువాత మా రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ అళగిరి (k s alagiri) నన్ను అభినందించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ (m k stalin) నుండి నాకు కాల్ వచ్చింది. జీవనోపాధి కోసం నిజంగా ఆటో నడుపుతున్నానా అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను అవునని సామాధానం ఇచ్చాను. నాకు అవకాశం కల్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కంటే కుంభకోణాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సూచించారు. నా నామినేషన్ పట్ల రాహుల్ జీ (రాహుల్ గాంధీ) కూడా సంతోషంగా ఉన్నారని మా నాయకులు నాకు చెప్పారు ’’ అని కె. శరవణన్ తెలిపారు.
పదో తరగతి వరకు చదువుకున్న శరవణన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్నారు. తాతయ్య దగ్గర పెరిగాడు. అతని తాత T కుమారసామి 1976లో కుంభకోణం మునిసిపాలిటీ సభ్యునిగా పనిచేశారు. తాత స్ఫూర్తితో శరవణన్ 2002లో కాంగ్రెస్‌లో చేరారు. వెంటనే వార్డు లీడర్‌గా తరువాత మున్సిపాలిటీలో పార్టీ డిప్యూటీ లీడర్‌గా నామినేట్ అయ్యారు.
“మా తాతకి కై గుర్తు (కాంగ్రెస్ చేతి గుర్తు) ఉండేది. నేనెప్పుడూ దాన్ని చేతిలో పెట్టుకోవాలనుకున్నాను. నాకు 22 ఏళ్లు ఉన్నప్పుడు తంజావూరు నార్త్ కాంగ్రెస్ కమిటీ నాయకుడిని కలిశాను. పార్టీలో చేరాను. అప్పటి నుంచీ పార్టీలోనే ఉన్నాను. ఎన్నికల పనుల్లో పాల్గొంటున్నాను. కొన్ని ఆందోళనల్లో అరెస్టు కూడా అయ్యాను. నాకు రాజకీయాలు నేర్పిన నాయకుడు లోగనాథన్. ఆయన ఖాళీ సమయంలో నన్ను తన ఆఫీసుకు పిలిపించి, పార్టీ కార్యకర్తలు, ఇతర సీనియర్ నాయకులు, సామాన్యులతో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించారు. ’’
శరవణన్ తన భార్య దేవి, ముగ్గురు పిల్లలతో కలిసి తుక్కంపాళయంలో అద్దె ఇంట్లో ఉంటూ రెండు దశాబ్దాలుగా ఆటోరిక్షా నడుపుతున్నాడు. కుంభకోణంలోని ప్రతి సందు తనకు తెలుసని, దీంతో నగరంలోని మొత్తం 48 వార్డుల ప్రజలతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఏడేళ్ల కిందట సొంతంగా ఆటోరిక్షా కొని దానిపై ఆధారపడి జీవిస్తున్నాడు. అందరి మాదిరిగానే తన ఆదాయాన్ని కూడా కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన తెలిపారు. వార్డు సభ్యుల సహాయంతోనే తాను కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేయగలిగానని శరవణన్ అంగీకరించాడు.
“ రోజుకు నాకు దాదాపు రూ. 200-250 వస్తుంది. లాక్ డౌన్ నా జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీసింది. పాఠశాలలు మూసివేసినందున నేను చాలా నష్టపోయాను. ఆ సమయంలో నా ప్రాంతంలోని ప్రజలు నాకు చాలా సహాయం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి వారు నాకు సహాయం చేసారు. వీలైనప్పుడల్లా నేను వారిని కలుస్తూనే ఉంటాను ’’ అని ఆయన చెప్పారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయడం, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు మొదలైన ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి పెట్టడం ప్రస్తుతం తన ముందున్న లక్ష్యాలని చెప్పారు.
కుంభకోణం కార్పొరేషన్ మేయర్ గా ఆయన ఎంపికైనప్పటికీ ఓ సాధారణ ఆటో డ్రైవర్ గానే ప్రమాణ స్వీకారానికి వచ్చారు. 20 ఏళ్ల పాటు నడిపిన ఆటోనే డ్రైవ్ చేస్తూ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వచ్చారు. దీంతో ఆయన సింప్లిసిటీని అందరూ అభినందించారు.