
Supreme Court: అవివాహిత పరస్పర అంగీకరంతో గర్భాన్ని దాల్చింది. తను తల్లిని కావడానికి సిద్దంగా లేననీ, తన 23 వారాల గర్భాన్ని తొలగించాలని ఢిల్లీ హైకోర్టు అనుమతి కోరింది. కానీ, ఆ సమయంలో పిండాన్ని తొలగించడం అంటే భ్రూణ హత్యకు పాల్పడినట్టేనని, అనుమతిని నిరాకరించింది. దీంతో అవివాహిత మహిళ నేడు .. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అవివాహిత మహిళా తరుపు న్యాయవాది దాఖాలు చేసిన పిటిషన్ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్వీకరించింది. ఆ మహిళ 24 వారాల గర్భవతి అని, ప్రతి ఒక్క రోజు ఆమెకు చాలా ముఖ్యమైనదనీ, కాబట్టి ఆమె కేసును ప్రాధాన్యతతో పరిగణించాలని, దయచేసి విచారణ కోసం కేసును జాబితా చేయండని అవివాహిత మహిళా తరుపు న్యాయవాది కోరారు. ఈ సందర్భంగా సీజేఐ తమ పిటిషన్‌పై విచారణ జరిపిన తర్వాత కేసు విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.
అవివాహిత స్త్రీ తన 23 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన తర్వాత.., ఏకాభిప్రాయ సంబంధం వల్ల ఉత్పన్నమయ్యే గర్భం కోసం 20 వారాల తర్వాత అబార్షన్ చట్టం కింద అనుమతించబడదని గమనించి, ఉపశమనం కోరుతూ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గత శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. దీన్ని అనుమతించడం నిజానికి భ్రూణహత్యతో సమానమని పేర్కొంది. 25 ఏండ్ల ఓ అవివాహిత యువతి తన 23 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆమె ఏకాభిప్రాయంతో తన స్నేహితుడితో సహాజీవనం చేసింది. కానీ, తన స్నేహితుడు తనని వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని కోర్టుకు తెలిపింది. వివాహేతర ప్రసవం.. తనకు మానసిక వేదనతో పాటు సామాజిక కళంకాన్ని కలిగిస్తుందని, అలాగే తల్లిగా ఉండటానికి మానసికంగా సిద్ధంగా లేదని చెప్పింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం న్యాయస్థానం తన అధికారాన్ని ఉపయోగించుకునేటప్పుడు చట్టానికి మించి వెళ్లదని పేర్కొంది. అయితే అమ్మాయిని ఎక్కడైనా సురక్షితంగా ఉంచాలనీ, శిశువుకు జన్మనిచ్చే వరకు వాళ్ల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. పుట్టబోయే పిల్లవాడిని పెంచాలని తాము అనడం లేదని, తొలుత ఆ అమ్మాయిని మంచి హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని, వారి వివరాలను బయటకు వెల్లడించారని తెలిపింది. తరువాత పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్లు చాలా మంది ఉన్నారనీ, దత్తత కోసం పెద్ద క్యూ కడుతున్నారని కోర్టు పేర్కొంది.