
మైనింగ్ మాఫియా చేతిలో ఓ పోలీసు అధికారి దారుణంగా హత్యకు గురయ్యారు. అక్రమ మైనింగ్‌ను ఆపడానికి వెళ్ళిన ఆయనను రాళ్ల లోడుతో ఉన్న ట్రక్కుతో ఢీకొట్టి చంపారు. ఈ ఘటన హర్యానాలోని Nuh జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆరావళి పర్వత శ్రేణి సమీపంలోని పచ్‌గావ్‌లో అక్రమంగా రాళ్లను తవ్వుతున్నట్లు డీఎస్పీ ర్యాంక్ అధికారి సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌కు సమాచారం అందింది. దీంతో ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసు బృందంతో కలిసి ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసు సిబ్బందిని గుర్తించిన వెంటనే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారు అక్కడి నుంచి పారిపోయారు. ఆయన అడ్డుగా నిలబడి రాళ్లతో నిండిన వాహనాలను ఆపమని సంకేతాలిచ్చారు. అయితే ఓ ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని సురేంద్ర సింగ్‌పైకి పోనిచ్చాడు. ట్రక్కు పైనుంచి వెళ్లడంతో సురేంద్ర సింగ్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు పోలీసులు పక్కకు దూకడంతో ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటన తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ విషయం తెలియడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు ఉన్నతాధికారులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ‘‘డీఎస్పీ సురేందర్ సింగ్ విధి నిర్వహణలో ఈరోజు ప్రాణాలర్పించారు. హర్యానా పోలీస్ విభాగం ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. నేరస్తులను శిక్షించేందుకు ఎటువంటి ప్రయత్నాన్ని విడిచిపెట్టం’’ అని హర్యానా పోలీసు శాఖ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఇక, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై స్పందించిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసు అధికారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. మరోవైపు మైనింగ్ మాఫియాను వదిలిపెట్టబోమని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ అన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు.
మరో కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా..
సురేంద్ర సింగ్.. హిసార్ జిల్లాలోని అడంపూర్ ప్రాంతంలోని సారంగపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన 1994 ఏప్రిల్ 12న హర్యానా పోలీస్ శాఖలో ASI పదవిలో చేరారు అక్టోబరు 31న ఆయన పోలీసు విధుల నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే మరో కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. సురేంద్ర సింగ్ ఇలా దారుణ హత్యకు గురికావడం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.