40 ఏళ్లలో ఆ జిల్లా పర్యటించిన తొలి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. కేంద్రం పథకాల అమలు సమీక్ష

By Mahesh KFirst Published Sep 26, 2022, 8:29 PM IST
Highlights

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా జునెబోటో జిల్లాకు వెళ్లారు. గత నాలుగు దశాబ్దాల్లో ఈ జిల్లాకు వెళ్లిన వెళ్లిన తొలి కేంద్ర మంత్రి ఈయనే కావడం గమనార్హం. అక్కడ కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించారు. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయ నేతల సందడి తక్కువగా ఉంటుంది. మరీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతాల్లో పర్యటించే మంత్రులు అరుదు అనే చెప్పాలి. కానీ, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూవర్షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇందుకు భిన్నంగా ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో పర్యటించారు. నాగాలాండ్ జిల్లా జునెబోటో జిల్లాలో గడిచిన నాలుగు దశాబ్దాల్లో పర్యటించిన తొలి కేంద్రమంత్రిగా రాజీవ్ చంద్రశేఖర్ నిలిచారు. ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో ఆయన మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన దీమాపూర్ గుండా తొమ్మిది గంటలు రోడ్డు మార్గాన ప్రయాణించి ఈ జిల్లాకు వెళ్లడం గమనార్హం.

జునెబోటో జిల్లా అధికారులతో ఆయన కలిసి మాట్లాడారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఆశావాహులకు అవకాశాలు కల్పించడం, ఎంటర్‌ప్రెన్యూవర్షిప్‌లకూ మంచి వాతావరణం కల్పించే మ్యాప్ గురించి వివరాలు అడిగారు. స్థానిక వనరులను సమర్థంగా వినియోగించి.. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలకు చెక్ పెట్టాలని సూచించారు.

అంతేకాదు, కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరును ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ కార్యక్రమాల అమలు చేస్తున్నవారిని ఉత్తేజితంగా పని చేయాలని సూచించారు. ప్రతి చివరి వ్యక్తి వరకూ ఈ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా పని చేయాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష మేరకు ప్రతి ఒక్కరి గళం వినాలని, ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించేలా పని చేయాలని వివరించారు. 

జునెబోటో, వోఖా జిల్లాల్లోని కేంద్ర పథకాల లబ్దిదారులనూ కలుసుకున్నారు. ఈ పథకాలు తమ జీవితాలు ప్రకాశవంతం చేశాయని చెప్పారు. ఈ పథకాలు అమల చేస్తున్న మోడీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా పని చేయడం, ఆయన కలలుగంటున్న సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్‌ను సాకారం చేయడంలో చిన్నపాటి పాత్ర తాను పోషించడం గర్వంగా ఉన్నదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.

అదే విధంగా ఆయన బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై ప్రధాని మోడీ విజన్‌ను వివరించారు. సబ్ కా సత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రసాద్ పునాదులుగా నూతన భారత నిర్మించాలనే ప్రధాని మోడీ ఆలోచనలను తెలిపారు.

అనంతరం, ఆసియాలోనే అతిపెద్ద బాప్టిస్ట్ చర్చిగా చెప్పే సుమి బాప్టిస్ట్ చర్చిని సందర్శించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఆయన వొఖా జిల్లాకు బయల్దేరి వెళ్లారు. అక్కడ జిల్లా అధికారులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపార వర్గాలు సహా లోంగ్సా కౌన్సిల్ హాల్ పెద్దలు, లోథా హోహో, ఎలో హోహో సంస్థల నిర్వాహకులను కలిశారు. రేపు సాయంత్రం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఢిల్లీకి తిరిగి రానున్నారు.

click me!