
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గత 25 సంవత్సరాలుగా పారదర్శకంగా, న్యాయంగా, వివక్షకు తావు లేకుండా వ్యవహరించడం ద్వారా ‘మోడల్ రెగ్యులేటర్’గా నిరూపించబడిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ట్రాయ్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాయ్‌కు పంపిన సందేశంలో.. టెలికాం రెగ్యులేటరీతో తనకున్న అనుబంధం గుర్తుచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద సెల్యులార్ స్టార్టప్‌గా దాని ఏర్పాటు ప్రక్రియలో తాను కూడా భాగం పంచుకున్నట్టుగా గుర్తుచేశారు. ట్రాయ్ అవశ్యకత, నిర్మాణం, ప్రక్రియలపై చర్చలు జరిపిన రోజుల నాటి నుంచి అనుబంధం ఉందన్నారు.
‘‘TRAI నిర్మించబడిన సూత్రాలు సరళమైనవి.. అంతేకాకుండా ఆదర్శప్రాయమైనవి. ఇవి పారదర్శకత, న్యాయబద్ధత, వివక్షత లేని విధానం, బహిరంగ సంప్రదింపుల సంప్రదాయం, న్యాయస్థానంలో పరీక్షించబడే మంచి సహేతుకమైన ఆదేశాలు’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇతర సంస్థల మాదిరిగానే ట్రాయ్ కూడా ఇన్నేళ్లలలో హెచ్చు తగ్గులను కలిగి ఉన్నప్పటికీ.. ఎల్లప్పుడూ వినియోగదారుల హక్కులను పరిరక్షించిందని చెప్పారు. అంతేకాకుండా టెలికాం రంగంలో ‘‘అధిక నాణ్యత, ధీర్ఘకాలిక’’ పెట్టుబడులు ఉండేలా చూస్తుందని కొనియాడారు.
‘‘నేడు 25 సంవత్సరాల తరువాత.. TRAI ఒక మోడల్ రెగ్యులేటర్‌గా నిలిచింది. వంద కోట్ల భారతీయులకు అంతరాయం లేని మొబైల్ టెలిఫోనీని, దాదాపు 700 మిలియన్ల భారతీయులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని సరసమైన ధరలకు, పోటీతత్వంతో అందించే రంగాన్ని నిర్మించడంలో సహాయపడటమే కాకుండా.. ప్రభుత్వ దార్శనికతను అమలు చేయడంలో ముందుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్‌కు భరోసా ఇస్తూనే.. 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ రంగాన్ని నిర్మించాలనే గౌరవప్రదమైన ప్రధానమంత్రి దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి TRAI పట్ల నాకు చాలా అంచనాలు ఉన్నాయి. నేను TRAIకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఇక, 2015లో రాజీవ్ చంద్రశేఖర్.. అప్పటి కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాసిన లేఖలో.. TRAI, DoT ఏదైనా సిఫార్సులు చేసే ముందు నెట్ న్యూట్రాలిటీకి సంబంధించిన అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు.