
న్యూఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ కు ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కౌంటరిచ్చారు. కర్ణాటకలో గత వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బెంగుళూరు పర్యటించిన సమయంలో చోటు చేసుకున్న ప్రోటోకాల్ రగడ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ గతంలో చోటు చేసుకున్న ఓ ఉదంతాన్ని ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు.
1983లో ఎస్‌ఎల్‌వీ-3 డీ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన తర్వాత శ్రీహరికోట ఇస్రో కేంద్రానికి అప్పటి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌టీరామారావును ఆహ్వానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓ ఫోటోను కూడ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
1983లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ శ్రీహరికోట రావాలని ఎన్‌టీఆర్ ను ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు.ఈ నెల 26న బెంగుళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సమయంలో ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణల నేపథ్యంలో గతంలో జరిగిన ఈ ఉదంతాన్ని జైరామ్ గుర్తు చేశారు.మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు.
ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపిన 'ఎమర్జెన్సీ' వంటి చిన్న సమస్యలను మరిచిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
అంతేకాదు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోడీని చాయ్ వాలా, ఒసామా బిన్ లాడెన్ , టెర్రరిస్ట్ అంటూ పిలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీబ్రాండింగ్ ద్వారా నిజాన్ని మార్చలేం అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.