ఆ రోజు మీరేం చేశారో నాకు తెలుసు.. క్షమాపణలు చెబితేనే : 12 ఎంపీల సస్పెన్షన్‌పై పీయూష్ గోయెల్

By Siva KodatiFirst Published Nov 30, 2021, 10:28 PM IST
Highlights

రాజ్యసభలో గందరగోళం సృష్టించారనే కారణంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజునే సస్పెండ్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ స్పందించారు. సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు.

రాజ్యసభలో గందరగోళం సృష్టించారనే కారణంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజునే సస్పెండ్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో విపక్ష పార్టీలు కేంద్రంపై భగ్గుమన్నాయి. తక్షణం వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ నిరసనకు దిగారు ఎంపీలు. దీనిపై కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ స్పందించారు. సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. సభలో మహిళా మార్షల్స్‌ మీద దాడికి పాల్పడ్డారని, వెల్‌లోకి ప్రవేశించి సభా కార్యకలాపాలు కొనసాగకుండా అడ్డుకున్నారని పీయూష్ పేర్కొన్నారు. 

మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. వర్షాకాల సమావేశాల చివరిరోజున మీ ప్రవర్తన నాకింకా గుర్తుందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో కొంత మంది ఎంపీలు.. మహిళా మార్షల్స్‌పై ... మరికొందరు పురుష మార్షల్స్‌పై దాడికి దిగారని పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్థాయిలో ప్రవర్తించారని.. దీనిపై ఒక కమిటీ వేశామని ఆయన చెప్పారు. ఇందులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారని.. ఆరోజున సభలో ఏం జరిగిందో కమిటీయే నిర్ధారిస్తుంది అని లోక్‌సభలో పీయూష్ తెలిపారు. 

అంతకుముందు 12మంది రాజ్యసభ (Rajya sabha) సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును (Venkaiah Naidu) విపక్షాలు మంగళవారం కోరాయి. అయితే సస్పెన్షన్ ఎత్తివేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరించారు. ఎంపీలు పశ్చాత్తాపం వ్యక్తం చేయనందున వారి సస్పెన్షన్‌ను రద్దు చేయబోమని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ నిర్ణయంపై ఆగ్రహించిన విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. 

ALso Read:Rajya sabha: ఎంపీలపై సస్పెన్షన్ రద్దు చేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరణ.. విపక్షాల వాకౌట్

‘సస్పెండ్ చేయబడిన ఎంపీలు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ప్రతిపక్ష నేత (మల్లికార్జున్ ఖర్గే) విజ్ఞప్తిని నేను పరిగణనలోకి తీసుకోవడం లేదు. సస్పెన్షన్ రద్దు చేయబడదు. గత వర్షాకాల సమావేశాల సందర్బంగా చోటుచేసుకున్న చేదు అనుభవం ఇప్పటికీ మనలో చాలా మందిని వెంటాడుతూనే ఉంది. గత సెషన్‌లో జరిగిన ఘటనలను సభలోని ప్రముఖులు తప్పుబట్టి, ఆగ్రహం వ్యక్తం చేయడానికి ముందుకు వస్తారని నేను ఎదురుచూశారు. అలా జరిగితే సభను మరింత సముచితంగా తీసుకెళ్లడంలో నాకు హెల్ప్ అయ్యేది. కానీ దురదృష్టవశాత్తు అది జరగదు’ అని వెంకయ్య నాయుడు అన్నారు. 

మరోవైపు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ (suspension of 12 Rajya Sabha MPs) చర్యలను నిరసిస్తూ లోక్‌సభ నుంచి కూడా విపక్షాలు వాకౌట్ చేశాయి. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద నిరసన తెలియజేశారు.  
 

click me!