అధికవేగానికి నేనూ చలానా కట్టా: న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ ని సమర్థించిన నితిన్ గడ్కరీ

By Nagaraju penumalaFirst Published Sep 9, 2019, 4:07 PM IST
Highlights

అధిక వేగం కారణంగా ముంబైలో తన వాహనం కూడా జరిమానాకు గురైందని చెప్పుకొచ్చారు. తాను కూడా ఆ జరిమానాను చెల్లించినట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో 30 శాతం నకిలీవేనని చెప్పుకొచ్చారు. 

ముంబై : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మోటార్‌ వాహన సవరణ చట్టం-2019 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలో రోడ్డు భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. 

అందులో భాగంగా నూతన మోటార్ వాహన చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన యాక్ట్ ప్రకారం విధించే జరిమానాలను నితిన్ గడ్కరీ సమర్థించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల పాలనపై ముంబైలో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధిక వేగం కారణంగా ముంబైలో తన వాహనం కూడా జరిమానాకు గురైందని చెప్పుకొచ్చారు. తాను కూడా ఆ జరిమానాను చెల్లించినట్టు తెలిపారు. 

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 786 బ్లాక్‌ స్పాట్స్‌ ఉన్నాయని స్పష్టం చేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో 30 శాతం నకిలీవేనని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్‌ అధికారులు ఎవరిపై వివక్ష చూపరన్న ఆయన నిబంధనలు ఉల్లఘించిన వారు ఎవరైనా సరే తప్పకుండా జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేశారు.  

గతంలో కొందరు ముఖ్యమంత్రుల వాహనాలకు సైతం అధికారులు జరిమానాలు విధించిన విషయాన్ని గుర్తు చేశారు. వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు ఇతర పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు. 

ఈ భారీ జరిమానాల కారణంగా ఎలాంటి అవినీతి జరగదని స్పష్టం చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టామని అలాంటప్పుడు అవినీతికి అస్కారం ఎక్కడుందని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన సవరణ చట్టాన్ని మోటార్ వాహన దారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  
 

click me!