అప్పీల్ కోసం దోషి వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇదంతా నాటకం: రాహుల్‌పై కిరణ్ రిజిజు విమర్శలు..

By Sumanth Kanukula  |  First Published Apr 3, 2023, 10:58 AM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు. అప్పీల్ దాఖలు చేయడానికి దోషి వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు. పరువు  నష్టం కేసులో రాహుల్ గాంధీ.. ఆయనకు విధించిన శిక్షను సవాలు చేసేందుకు సూరత్ వెళ్లే అవకాశం ఉందన్న వార్తలపై కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అప్పీల్ దాఖలు చేయడానికి దోషి వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా.. ఏ దోషి వ్యక్తిగతంగా వెళ్లరని అన్నారు. రాహుల్ కోర్టుకు వ్యక్తిగతంగా వెళ్లడం ఒక నాటకం మాత్రమే అని విమర్శించారు. రాహుల్ చేస్తున్నది కోర్టుపై ఒత్తిడి తీసుకురావాలనే చిన్నపిల్లాడి ప్రయత్నమే అంటూ సెటైర్లు వేశారు. 

‘‘అప్పీల్ దాఖలు చేసేందుకు రాహుల్ గాంధీ సూరత్ వెళ్లే అవకాశం ఉంది. అప్పీల్ దాఖలు చేయడానికి దోషి వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు. సాధారణంగా.. ఏ దోషి వ్యక్తిగతంగా వెళ్లరు. అతనితో పాటు నాయకులు, సహాయకుల రంగురంగుల సమూహంతో అతను వ్యక్తిగతంగా వెళ్లడం ఒక నాటకం మాత్రమే. రాహుల్ గాంధీ చేస్తున్నది కూడా అప్పీల్ కోర్టుపై ఒత్తిడి తీసుకురావాలనే చిన్నపిల్లాడి ప్రయత్నమే. దేశంలోని అన్ని న్యాయస్థానాలు ఇటువంటి వ్యూహాల నుండి తప్పించుకున్నాయి’’ అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చెప్పేది వినండి అంటూ.. ఓ వీడియో లింక్‌ను కూడా కిరణ్ రిజిజు షేర్ చేశారు. కాంగ్రెస్ వ్యూహాలను ఎండగట్టండని పిలుపునిచ్చారు. 

Latest Videos


 

Rahul Gandhi might be going to Surat to file an Appeal. It is not required of a convict to go personally to file an Appeal. Generally, no convict goes personally. His going personally with a motley group of leaders and aides accompanying him is only a drama. (1/2)

— Kiren Rijiju (@KirenRijiju)

 

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్రిమినల్ పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడం, శిక్ష విధించడాన్ని సవాలు చేసేందుకు సిద్దమయ్యారు. పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తున్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేయాలని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సెషన్ కోర్టులో తీర్పు వెలువడే  వరకు తనకు ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై మధ్యంతర స్టే విధించాలని కూడా రాహుల్ అభ్యర్థించనున్నారు. రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ చీమా కోర్టులో వాదించనున్నారు.

ఇక, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..  మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ‘‘దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ.. సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. 

అయితే ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేశారు. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. అయితే సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో రాహుల్‌పై లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా వెల్లడించింది. అయితే అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్  గాంధీ వయనాడ్ నుంచి విజయం సాధించారు. 

click me!