అప్పడాలతో కరోనా కట్టడంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు: కేసు పెట్టాలంటూ కాంగ్రెస్ డిమాండ్

By Siva KodatiFirst Published Jul 24, 2020, 9:18 PM IST
Highlights

 అప్పడాలతో కరోనాను కట్టడి చేయవచ్చంటూ అర్జున్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

భారతదేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో శ్రమిస్తున్నాయి. అటు వివిధ దేశాల్లో వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అప్పడాలతో కరోనాను కట్టడి చేయవచ్చంటూ అర్జున్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. బికనీర్‌కు చెందిన అప్పడాలు తయారు చేసే సంస్థ ఆత్మ నిర్బర భారత్‌లో భాగంగా భాభీజి పేరుతో అప్పడాలను తయారు చేసింది. వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలు మానవ శరీరంలో కరోనాపై పోరాడేందుకు యాంటీ బాడీల ఉత్పత్తి చేసేందుకు సహాయపడతాయని కేంద్ర మంత్రి అన్నారు.

Also Read:ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 12,87,945కి చేరిక

ఇలాంటి ఒక ఉత్పత్తిని తయారు చేసినందుకు ఆ సంస్థను అభినందిస్తున్నానని మేఘ్‌వాల్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాంగ్రెస్ నేత హితేంద్ర పిథాడియా షేర్ చేశారు. పోలీసులు ఈ వీడియోను సుమోటాగా తీసుకుని అసత్యమైన, అశాస్త్రీయమైన సమాచారాన్ని ప్రచారం చేసినందుకు కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు మేఘ్‌వాల్‌పై మండిపడుతున్నారు. మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయని.. వ్యాక్సిన్ తయారీకి ప్రపంచం మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటే అర్జున్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

click me!