భారత ఆటగాళ్లకు అనుమతి నిరాకరణ.. చైనా పర్యటనను రద్దు చేసుకున్న అనురాగ్ ఠాకూర్

By Siva Kodati  |  First Published Sep 22, 2023, 3:27 PM IST

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ముగ్గురు భారతీయ వుషు ఆటగాళ్లు నైమాన్ వాంగ్సు, ఒనిలు తేగా, మెపుంగ్ లాంగులకు చైనాలో ప్రవేశం నిరాకరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు 


కేంద్ర , సమాచార, ప్రసార , యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ముగ్గురు భారతీయ వుషు ఆటగాళ్లు నైమాన్ వాంగ్సు, ఒనిలు తేగా, మెపుంగ్ లాంగులకు చైనాలో ప్రవేశం నిరాకరించడంతో ఆ దేశ పర్యటనను అనురాగ్ ఠాకూర్ రద్దు చేసుకున్నట్లుగా కేంద్ర విదేశాగ శాఖ వెల్లడించింది. మన ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు భారత ప్రభుత్వానికి వుందని పేర్కొంది.

నివాస ప్రాతిపదికన భారతీయ పౌరుల పట్ల అవలంభించే భిన్నమైన వైఖరిని ఇండియా తిరస్కరిస్తుందని ఎంఈఏ స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులకు చైనా అక్రిడిటేషన్‌ను నిరాకరించడం సరికాదని విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసియా క్రీడల స్పూర్తిని, నియమాలను చైనా ఉల్లంఘిస్తోందని ఫైర్ అయ్యింది. 

Latest Videos

 

Our response to media queries on some Indian sportspersons being denied entry into 19th Asian Games:https://t.co/wtoQA8zaDH pic.twitter.com/cACRspcQkD

— Arindam Bagchi (@MEAIndia)

 

ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్‌జౌకు విమానంలో బయల్దేరింది. అయితే వీరిలో ముగ్గురికి చైనా అనుమతి నిరాకరిచడంతో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌కు భారత ఆటగాళ్లను అధికారులు తీసుకొచ్చారు. అయితే త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

చైనా స్పందన ఇదే :

ఇదిలావుండగా.. భారత ఆటగాళ్లకు చైనాలో ప్రవేశం నిరాకరించడంపై ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఆతిథ్య దేశంగా, చట్టబద్ధంగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు హాంగ్‌జౌకు రావాలని చైనా అన్ని దేశాల అథ్లెట్లను స్వాగతిస్తోందన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదని నింగ్ వ్యాఖ్యానించారు. 

click me!