గాలి ద్వారా కరోనా వ్యాప్తి: చికిత్స, ఔషధాల వినియోగంపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

By Siva KodatiFirst Published May 26, 2021, 9:48 PM IST
Highlights

కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి సవరించింది. గాలి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం వుందని మరోసారి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కోవిడ్ 19 క్లినికల్‌ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో దీనిని చేర్చింది కేంద్రం. కరోనా చికిత్స, ఔషధాల వాడకాన్ని కొత్త మార్గదర్శకాల్లో చేర్చింది. 

కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి సవరించింది. గాలి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం వుందని మరోసారి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కోవిడ్ 19 క్లినికల్‌ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో దీనిని చేర్చింది కేంద్రం. కరోనా చికిత్స, ఔషధాల వాడకాన్ని కొత్త మార్గదర్శకాల్లో చేర్చింది. ఐవర్ మెక్టిన్ ట్యాబ్లెట్లు, స్టెరాయిడ్స్ వాడకంపైనా స్పష్టత ఇచ్చింది. స్వల్ప లక్షణాలున్న వారికి రోజుకు ఒకటి చొప్పున 3 నుంచి 5 రోజుల పాటు ఐవర్ మెక్టిన్ ఇవ్వాలని సూచించింది. స్టెరాయిడ్ల వాడకంలో జాగ్రత్తగా వుండాలని వెల్లడించింది. ముఖ్యంగా స్వల్ప లక్షణాలున్న వారికి స్టెరాయిడ్స్ అవసరం లేదని కేంద్రం తెలిపింది.

కరోనా రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాట్లాడినప్పుడు వైరస్ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక మీటర్ కంటే తక్కువ దూరం వున్న సమయంలో నోటీ తుంపర్ల ద్వారా ఎదుటి వారికి కళ్లు, నోరు, ముక్కు ద్వారా సోకే ప్రమాదం వుంటుందని పేర్కొంది. వెంటిలేషన్ తక్కువగా వుండే ప్రాంతాలు, రద్దీగా వుండే ఇంటి లోపలి ప్రాంతాల్లో వైరస్ ఎక్కువ సమయం స్థిరంగా వుండే అవకాశం వుంటుందని తెలిపింది. అలాంటి ప్రదేశాల్లో వైరస్ మీటర్ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆస్కారం వుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో ఈ సూచనను కేంద్ర ఆరోగ్య శాఖ సవరించిన ప్రోటోకాల్‌లో చేర్చింది.

Also Read:కరోనా వ్యాప్తికి అసలు కారణం ఇదే.. కేంద్రం

గతేడాది జూన్‌లో విడుదల చేసిన ప్రోటోకాల్‌లో వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం, తుమ్మడం, దగ్గడం వల్ల వచ్చే శ్వాస బిందువులతో మాత్రమే వైరస్ వ్యాపిస్తుందని తెలిపింది. తాజాగా గాలి ద్వారానూ వైరస్ వ్యాపిస్తుందని చేర్చింది. తుంపర్ల ద్వారా వైరస్ గాలిలో దాదాపు పది మీటర్ల వరకు ప్రయాణించగలదని.. ఎప్పుడూ మూసివుంచే గదుల్లో ఏరోసొల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపింది. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, అందుకే ఇళ్లు, పనిప్రదేశాల్లో గాలి, వెలుతురు వచ్చేలోగా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

click me!