
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ ఉపవేరియంట్ల హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్ఈ వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించిందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆ కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఇండియన్ సార్స్ కోవ్ 2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్(ఇన్సాకాగ్) అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. ముంబయిలో కొత్త వేరియంట్ నమోదైందన్న వార్తలు అవాస్తవాలని పేర్కొంది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ 50 ఏళ్ల మహిళలో ఈ కొత్త వేరియంట్ సోకిందని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే కేంద్ర ఆరోగ్య శాఖ స్పందిస్తూ ఆ వార్తను ఖండించింది.
ఒమిక్రాన్ వేరియంట్ ఉప వేరియంట్లు అయినా బీఏ.1, బీఏ.2 వేరియంట్లతో ఏర్పడ్డ హైబ్రీడ్ వేరియంటే ఈ ఎక్స్ఈ వేరియంట్. ప్రపంచంలో ప్రస్తుతం మూడు హైబ్రిడ్ వేరియంట్లు ఉనికిలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ ఎక్స్ఈ వేరియంట్ ఇతర అన్ని కరోనా వేరియంట్ల కంటే కూడా అత్యధిక వేగంతో వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే వెల్లడించింది.
ఆ మహిళకు సంబంధించి ఫాస్ట్‌క్యూ ఫైల్స్‌ను ఇన్సాకాగ్ నిపుణులు పరిశీలించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఎక్స్ఈ వేరియంట్ జీనోమిక్ పిక్చర్‌తో ఆమె శాంపిల్‌లోని జీనోమిక్ కణాలు సరిపోలడం లేదని తేలినట్టు వివరించింది.
ఈ రోజు మహారాష్ట్ర ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ) విడుదల చేసిన ఓ బులెటిన్ భారత్‌కు 27న వచ్చిన ఓ 50 ఏళ్ల దక్షిణాఫ్రికా పౌరురాలిలో ఎక్స్ఈ వేరియంట్ కనుగొన్నట్టు తెలిపింది. తమ ప్రాథమిక సీక్వెన్సింగ్ ప్రక్రియలో ఆమెకు కొత్త ఎక్స్ఈ వేరియంట్ సోకినట్టుగా తేలిందని వివరించింది. అయితే, సమగ్ర సీక్వెన్సింగ్ ప్రక్రియ కోసం ఆమె శాంపిల్‌ను కస్తుర్బా హాస్పిటల్ సెంట్రల్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు పేర్కొంది. ఇంటర్నేషనల్ రిపోసిటరీ ఆఫ్ జీనోమిక్ సీక్వెన్సింగ్ ఆఫ్ వైరసెస్ (జీఐఎస్ఏఐడీ) కూడా ఈ వేరియంట్‌ను ధ్రువీకరించిందని పేర్కొంది. అయితే, నేషనల్ లేబరేటరీ ఎక్స్ఈ వేరియంట్ ధ్రువీకరణ కోసం మరో దఫా జీనోమిక్ సీక్వెన్సింగ్ చేసి నిర్ణయం వెల్లడిస్తుందని వివరించింది.
అయితే, ఇన్సాకాగ్‌కు చెందిన కొన్ని ఉన్నత వర్గాలు మాట్లాడుతూ మహారాష్ట్ర ఐడీఎస్‌పీ టీమ్ బహుశా ఆ వేరియంట్‌ను అర్థం చేసుకోవడంలో తప్పు చేశారేమోనని తెలిపాయి.
తొలి వైరస్‌తోపాటు డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ప్రపంచ దేశాలను గడగడలాడించాయి. అయితే, ఈ వేరియంట్లతోపాటు ఇప్పుడు ఉప వేరియంట్ల హైబ్రిడ్‌లు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం మూడు హైబ్రిడ్ వేరియంట్లు ఉనికిలో ఉన్నట్టు చర్చ ఉన్నది. డెల్టా, ఒమిక్రాన్‌లకు చెందిన ఉప వేరియంట్ల హైబ్రిడ్ వేరియంట్లు రెండు ఉన్నాయి. కేవలం ఒమిక్రాన్ ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2 వేరియంట్లకు సంబంధించిన హైబ్రిడ్ వేరియంట్ ఒకటి(ఎక్స్‌ఈ వేరియంట్) ఉన్నది. ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన రెండు ఉపవేరియంట్ల హైబ్రిడ్ వేరియంటే.. ఈ ఎక్స్ఈ వేరియంట్.
యూకే కాకుండా థాయ్‌లాండ్, న్యూజిలాండ్‌లలోనూ ఈ వేరియంట్ నమోదైంది. ఇప్పటి వరకు వెలుగుచూసిన అన్ని కరోనా వైరస్‌ల కంటే కూడా ఎక్స్‌ఈ అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది వరకే వెల్లడించింది.