కోవిడ్ రూల్స్ పాటించండి.. లేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయండి: రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి లేఖ

By Sumanth KanukulaFirst Published Dec 21, 2022, 10:32 AM IST
Highlights

ప్రపంచంలోని పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి, జస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా లేఖ రాశారు.

ప్రపంచంలోని పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీచేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడూ గుర్తించేందుకు పాజిటివ్ నమునాలను పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే తాజాగా భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా లేఖ రాశారు.

రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు పీపీ చౌదరి, నిహాల్ చంద్, దేవ్‌జీ పటేల్ కరోనా వ్యాప్తిపై లేవనెత్తిన ఆందోళనల దృష్ట్యా.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఈ లేఖలో మంత్రి మన్సుఖ్ మాండవీయా సూచించారు. మాస్క్‌లు, శానిటైజర్‌ వినియోగించాలని.. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు మాత్రమే యాత్రలో పాల్గొనేలా చూడాలని స్పష్టం  చేశారు. రాజస్థాన్‌లోని ముగ్గురు ఎంపీలు చేసిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని సత్వర చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీని, అశోక్ గెహ్లాట్‌లను కోరారు. 


కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించడం సాధ్యం కాకపోతే.. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేయాలని రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా అభ్యర్థించారు.

ఇక, రాజస్తాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు డిసెంబర్ 20న రాసిన లేఖలో.. ఇతర రాష్ట్రాల ప్రజలు భారత్ జోడో యాత్రలో పాల్గొనడానికి రాజస్థాన్‌కు వస్తున్నందున కోవిడ్ వ్యాప్తి ప్రమాదం పెరుగుతోందని ప్రస్తావించారు. యాత్రలో పాల్గొన్నవారిలో చాలా మందిలో లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు యాత్రలో పాల్గొని తిరిగి వెళ్లిన తర్వాత.. ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఎంపీల సంతకాలతో కూడిన లేఖను జతచేస్తూ.. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా కోవిడ్ నిబంధనలు పాటించాలని రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్‌లకు లేఖ రాశారు. 

click me!