రోజుకు రూ. 400 సంపాదించే కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ. 14 కోట్లు పన్ను కట్టాలని నోటీసులు..

By Sumanth KanukulaFirst Published Dec 21, 2022, 10:00 AM IST
Highlights

రోజంతా కష్టపడితే అతడు రూ. 400 సంపాదిస్తాడు. అలాంటిది రూ. 14 కోట్లు పన్ను కట్టాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం అతడిని షాక్‌కు గురిచేసింది.

రోజంతా కష్టపడితే అతడు రూ. 400 సంపాదిస్తాడు. అలాంటిది రూ. 14 కోట్లు పన్ను కట్టాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం అతడిని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. రోహతాస్ జిల్లాలోని కర్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనోజ్ యాదవ్ నివాసం ఉంటున్నాడు. రోజువారీ కూలీగా పనిచేసే అతడు రోజుకు రూ.400 సంపాదిస్తున్నాడు. తాజాగా ఐటీ అధికారుల నుంచి మనోజ్ యాదవ్ ఓ నోటీసులు అందుకున్నాడు. ఆ నోటీసుల్లో మనోజ్ నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి రూ. 14 కోట్ల పన్ను చెల్లించాలని ఐటీ అధికారులు పేర్కొన్నారు. 

ఆ నోటీసులు చూసి మనోజ్ యాదవ్ షాక్ తిన్నాడు. మనోజ్‌ కుటుంబ సభ్యులతో పాటు, ఇరుగుపొరుగు వారు ఈ నోటీసుల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని మనోజ్ తెలిపాడు. అయితే మనోజ్‌ యాదవ్‌కు సంబంధించిన బ్యాంకు రికార్డుల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు నమోదయ్యాయని.. అందువల్ల అతడు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఐటీ అధికారులు పేర్కొన్నారు. అయితే తాను దినసరి కూలీనని.. తన ఆస్తి మొత్తం అమ్మినా రూ. 14 కోట్లు చెల్లించలేనని యాదవ్‌ ఐటీ అధికారులకు చెప్పారు. 

అయితే 2020 మార్చిలో కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు మనోజ్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలోని ప్రైవేట్ కంపెనీలలో పనిచేశాడని తెలుస్తోంది. అక్కడ కంపెనీలు తన పత్రాలను మోసపూరితంగా ఉపయోగించి తన పేరు మీద నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించి, పన్నులు చెల్లించకుండా లావాదేవీలు నిర్వహించి ఉంటాయని మనోజ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రైవేట్‌ కంపెనీలు తన ఆధార్‌, పాన్‌ కార్డుల కాపీలను తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

click me!