పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

By Mahesh KFirst Published Aug 3, 2022, 6:16 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో బిల్లు ఉపసంహరణ కోసం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మూజువాణి ద్వారా ఆమోదం లభించింది. 
 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2019ను ఉపసంహరించుకుంది. దీని ప్లేస్‌లో త్వరలోనే కొత్త బిల్లును ప్రవేశపెడతామని తెలిపింది. ఈ బిల్లును ఉపసంహరించడానికి గల కారణాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 

2019లో వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పౌరుల వ్యక్తిగత సమాచారం టెక్ దిగ్గజ కంపెనీల చేతిలోకి వెళ్లుతుందని ఆరోపించాయి. పౌరుల గోప్యత వివరాలకు భద్రత లేదని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా పరిశీలించే ముప్పు ఉన్నదని వాదించాయి. దేశ భద్రత, ఇతర కారణాలు చెబుతూ కొన్ని అనవసర నిబంధనలతో పౌరుల వ్యక్తిగత వివరాలను ప్రభుత్వం సేకరించే అవకాశాన్ని ఈ బిల్లు ఇస్తున్నదని ఆరోపించాయి. అందుకే ఈ బిల్లును ముసాయిదాను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి.

జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లులో 81 సవరణలు సూచించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అంతేకాదు, 12 సిఫారసులూ చేసిందని తెలిపారు. వాటికి అనుగుణంగా లీగల్ ఫ్రేమ్ వర్క్ చేయాలని పేర్కొన్నట్టు వివరించారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని తెలిపారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సవరణలకు సరిపడా లీగల్ ఫ్రేమ్ వర్క్‌తో కొత్త బిల్లును రూపొందిస్తామని చెప్పారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ఈ బిల్లును ఉపసంహరించడానికి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మూజువాణి ద్వారా స్పీకర్ ఓటింగ్ పెట్టారు. ఈ తీర్మానానికి ఆమోదం లభించడంతో బిల్లు ఉపసంహరించుకున్నట్టు అయింది.

click me!