ముంబయి నుంచి దుబాయ్ వెళ్లి తిరిగి రాలేదు.. 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ సోషల్ మీడియాలో దర్శనం

By Mahesh KFirst Published Aug 3, 2022, 5:27 PM IST
Highlights

ముంబయి నుంచి దుబాయ్ వెళ్లిన ఓ మహిళ తిరిగి రాలేదు. 20 ఏళ్లు గడిచిన ఆమె ఆచూకీ కానరాలేదు. ఆ మహిళ కూతురు మాత్రం తల్లి కోసం గాలింపులు ఆపలేదు. చివరకు ఓ సోషల్ మీడియాలో అకౌంట్‌లో తల్లి వీడియో కనిపించింది. ఆమె పాకిస్తాన్‌లో ఉన్నట్టు స్పష్టం అయింది.
 

న్యూఢిల్లీ: సోషల్ మీడియా తల్లి కూతురును కలిపింది. ముంబయికి చెందిన ఓ మహిళ తరుచూ దుబాయ్, లేదా ఖతర్‌కు వెళ్లేది. అక్కడ వంట చేసి తిరిగి వచ్చేది. కానీ, చివరి సారి ఆమె ఓ ఏజెంట్ సహాయంతో విదేశానికి వెళ్లింది. కానీ, మళ్లీ తిరిగి రాలేదు. ఏజెంట్‌ను సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పలేదు. సరికదా కొన్నాళ్లకు ఆ ఏజెంట్ అక్కడి నుంచి చెక్కేశాడు. ఆమెను గల్ఫ్ దేశంలో మిస్ అయినట్టు ఎవిడెన్స్ కూడా లేవు. దీంతో తల్లిని వెతకడం ఆ కూతురుకు కష్టమైంది. కానీ, సోషల్ మీడియా ఈ కష్టాన్ని తొలగించింది. సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తన తల్లి పాకిస్తాన్‌లో ఉన్నదని తెలుసుకోగలిగింది.

తన తల్లి హమీదా బాను చాలాసార్లు గల్ఫ్ కంట్రీకి వెళ్లేదని, అక్కడ వంట పని చేసి రెండు లేదా నాలుగేళ్లకు తిరిగి వస్తుండేదని ముంబయికి చెందిన యస్మిన్ షేక్ చెప్పారు. కానీ, చివరిసారి ఓ ఏజెంట్ సహాయంతో దుబాయ్ వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని వివరించారు. కానీ, పాకిస్తాన్‌కు చెందిన ఓ సోషల్ మీడియా అకౌంట్ పోస్టు చేసిన వీడియో ద్వారా తన తల్లి ఆచూకీని తెలుసుకున్నానని పేర్కొన్నారు.

ఆ వీడియోలో హమీదా బాను తన భర్త, పిల్లలు, సోదరీ సోదరుల పేర్లను వివరాలను వరుసగా వెల్లడిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారని హమీదా బాను సోదరి షహీద తెలిపారు. దీంతో ఆమెను సులువుగా గుర్తించగలిగామని వివరించారు. 

తల్లి పాకిస్తాన్‌లో ఉన్నదని యస్మిన్ షేక్ తెలుసుకోగలిగారు. కానీ, ఆమె ఇంకా పాకిస్తాన్‌లో ఉన్నది. ఆమెను తిరిగి ముంబయికి తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నది.

click me!