కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపండి.. ఏఎస్ఐకి కేంద్రం ఆదేశాలు

By Mahesh KFirst Published May 22, 2022, 1:46 PM IST
Highlights

ఒక వైపు జ్ఞానవాపి మసీదులో సర్వే చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా, ఢిల్లీలోని కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలు జరపాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 
 

న్యూఢిల్లీ: వారణాసిలో కాశీవిశ్వనాథ ఆలయాన్ని అంటుకునే ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే చేపట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అందులో శివలింగం ఉన్నట్టు సర్వే అధికారులు చెప్పడం చర్చను తీవ్రతరం చేసింది. జ్ఞానవాపి మసీదుపై చర్చ జరుగుతుండగానే ఢిల్లీలోని కుతుబ్ మినార్‌ కాంప్లెక్స్‌లోనూ తవ్వకాలు జరపాలని కేంద్రం ఆదేశాలు రావడం గమనార్హం. కుతుబ్ మినార్‌ను హిందూ పాలకుడు రాజా విక్రమాదిత్య నిర్మించాడనే వ్యాఖ్యలు వచ్చాయి.  దాని సమీపంలో హిందూ దైవం, ఇతర విగ్రహాలు బయల్పడ్డట్టు కొందరు వాదిస్తున్నారు. తాజాగా, కేంద్ర సాంస్కృతిక శాఖ కుతుబ్ మినార్‌ దగ్గర తవ్వకాలు జరపాలని, ఐకానగ్రఫీ చేపట్టాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు ఆదేశాలు ఇచ్చింది.

కుతుబ్ మినార్‌ను కుతుబుద్దిన్ ఐబక్ నిర్మించలేదని, రాజా విక్రమాదిత్య నిర్మించాడని ఏఎస్ఐ మాజీ రీజనల్ డైరెక్టర్ ధరమ్ వీర్ శర్మ పేర్కొనడంతో వివాదం రాజుకుంది. ఈ కుతుబ్ మినార్‌ను సూర్యుడి దిశల గురించి అధ్యయనం చేయడానికి నిర్మించాడని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ శనివారం అంటే మే 21న కుతుబ్ మినార్ సైట్ సందర్శించారు. ముగ్గురు చరిత్రకాలరు, నలుగురు ఏఎస్ఐ అధికారులు, మరికొందరు పరిశోధకులతో కలిసి ఆయన కుతుబ్ మినార్‌ ను సందర్శించారు. ఈ పర్యటనలోనే ఆయన కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో మళ్లీ తవ్వకాలు జరపాలనే నిర్ణయం తీసుకున్నారు. 1991 నుంచి మళ్లీ ఇక్కడ తవ్వకాలు జరపలేదని ఏఎస్ఐ అధికారులు ఆయనకు వివరించారు. మసీదుకు సుమారు 15 మీటర్ల దూరంలో తవ్వకాలు జరిపి.. రిపోర్టును సమర్పించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఏఎస్ఐ అధికారులను ఆదేశించారు.

ఢిల్లీలోని కుతుబ్ మినార్‌ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదని, రాజా విక్రమాదిత్య నిర్మించాడని మాజీ ఆర్కియాలజీ రీజనల్ డైరెక్టర్ ధరమ్‌వీర్ శర్మ ఇటీవలే వెల్లడించారు. అది కూడా సూర్యుడిని పరిశీలించడానికి ఈ నిర్మాణం చేపట్టారని వివరించారు.

ఇది అసలు కుతుబ్ మినారే కాదని, సన్ టవర్ (అబ్జర్వేటరీ టవర్) అని ఆర్కియాలజీ మాజీ అధికారి అన్నారు. ఈ కుతుబ్ మినార్‌ ను ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య నిర్మించాడని, కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదని వివరించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పురావస్తు శాఖ తరఫున ఆయన చాలా సార్లు టవర్‌ను సర్వే చేశాడు.

ఈ టవర్ 25 ఇంచుల మేరకు ఒక వైపు వంగి ఉంటుందని ఆయన వివరించారు. ఎందుకంటే.. ఈ కుతుబ్ మినార్ ద్వారా సూర్యుడిని పరిశీలించే వారని చెప్పారు. జూన్ 21న సొలస్టైజ్ నుంచి తప్పించుకోవడం కోసం కుతుబ్ మినార్‌ ను ఇలా ఒక వైపు వంగినట్టుగా నిర్మించారని పేర్కొన్నారు. ఇదే శాస్త్రీయమైన నిజం అని చెప్పారు.

అందుకే స్వతంత్రంగా కనిపించే ఈ కుతుబ్ మినార్‌కు సమీపంలోని మసీదుకు సంబంధం లేదని వవిరించాడు. కుతుబ్ మినార్ ద్వారం ఉత్తరం వైపు ఉంటుంది. రాత్రి వేళ్లల్లో ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని చూడటానికి దీన్ని ఉఫయోగించుకున్నారని చెప్పారు.

click me!