
బడ్జెజ్ సమావేశాల్లో భాగంగా 2020-21 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సభ ముందకు తీసుకొచ్చారు.
ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరం వృద్ధిరేటు 7.7 శాతంగా వుందని ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు.
2021-22 ఆర్ధిక సంవత్సరం అంచనా వృద్ధిరేటు 11.5 శాతమని తెలిపారు. ఐఎంఎఫ్ నివేదిక ఆధారంగా 2021- 22 అంచనా వేసినట్లు ఆర్ధిక సర్వేలో ప్రభుత్వం తెలిపింది. వచ్చే రెండేళ్లలో ఆర్ధిక పరిస్ధితి కోవిడ్ పూర్వ స్థితికి వెళ్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను పేర్కొన్నారు.