
కేంద్రంలో మరోమారు అధికారంలో రావడంతో పాటు.. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకత్వం కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.గత రాత్రి ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ నేతలు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో కాస్తా డీలా పడ్డ బీజేపీ.. సరికొత్త వ్యూహలతో ముందుకు సాగాలని భావిస్తుంది.
అంతేకాకుండా కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్నందున.. వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జూలై 3న ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందనే వార్తలు వెలువుడుతున్నాయి. అలాగే పార్టీలో భారీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ విషయానికి వస్తే.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతున్నారు. బీజేపీ నిబంధనల ప్రకారం ఆయన పదవీకాలం ఇప్పటికే పూర్తైంది. అయితే ఎన్నికల ఏడాది కావడంతో.. అధ్యక్షుడి మార్పు విషయంలో బీజేపీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుతం టీ బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. కీలక మార్పులు చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి.. కేంద్ర మంత్రి కూర్పులో ఆయనకు స్థానం కల్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
అదే సమయంలో అయితే మరి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఈ పదవికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుడికి కాకుండా, చాలా కాలంగా బీజేపీలోనే ఉన్న వ్యక్తికే ఆ పదవి అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. పలురకాల అభ్యంతరాలు, విమర్శలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని.. టీ బీజేపీ చీఫ్‌గా నియమించడాన్ని బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లిన పక్షంలో.. కిషన్ రెడ్డిని రాష్ట్రానికి పరిమితం చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఇక, ఈటల రాజేందర్‌కు రాష్ట్ర పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలనే బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏపీ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటే జరగనున్నాయి. అయితే అక్కడ ఇప్పటికే రాజకీయం వెడేక్కింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ జనాల్లో తిరుగుతున్నారు. మరోవైపు అధికార వైసీపీ కూడా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఏపీలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకులు మాట. కాకపోతే అక్కడ బీజేపీకి జనసేనతో పొత్తు ఉంది. అయితే ఈ కూటమిలోకి టీడీపీ కూడా చేరాలని చూస్తోంది. అలాగైతేనే వైసీపీ అధికార బలాన్ని తట్టుకోగలమని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తతుం ఏపీ బీజేపీలో కొందరు టీడీపీ అనుకూల వర్గంగా, మరికొందరు వైసీపీ అనుకూల వర్గంగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును పార్టీలోని పలువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వైఖరి అధికార వైసీపీకి అనుకూలంగా ఉందనే విమర్శలు చేస్తూ కొందరు నేతలు పార్టీని కూడా వీడారు. మరోవైపు సోము వీర్రాజుకు పార్టీ అధిష్టానంతో సత్సబంధాలు లేవనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు పొత్తులు, ఇతర అంశాలపై ఆయన చేసే ప్రకటనలు కూడా గందరగోళంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే సోము వీర్రాజును ఆ బాధ్యతల నుంచి తప్పించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ స్థానంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ వర్గాల్లో చర్చ సాగుతుంది.