Latest Videos

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి అనుకోని అతిథి... రాష్ట్రపతి భవన్‌లో చిరుత ప్రత్యక్షం

By Galam Venkata RaoFirst Published Jun 10, 2024, 5:09 PM IST
Highlights

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి అనుకోని అతిథి హాజరైంది. రాష్ట్రపతి భవన్ లో ఆదివారం కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో స్టేజీ వెనుక వైపు ఓ జంతువు ఠీవిగా అటు ఇటు తిరిగింది. ఈ  దృశ్యాలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. పలువురు విదేశీ అతిథలు, దేశంలోని రాజకీయ, సినీ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే, ఓ అనుకోని అతిథి కూడా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై.. అందరినీ అశ్చర్యపరిచింది. 

రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పలువురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ఒక్కసారిగా అనుకోని ఓ అతిథిగా ప్రత్యక్షమైంది. కేంద్ర సహాయ మంత్రిగా అజయ్‌ తమ్తాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయిస్తున్న సమయంలో వారి వెనుకాలే ఓ చిరుత ప్రత్యక్షమైంది. ఆ తర్వాత మరోసారి అజయ్‌ తమ్తా ప్రమాణ స్వీకారం చేసి.. సంతకం చేస్తున్న సమయంలోనూ మరోసారి స్టేజీ వెనుక వైపు తిరుగుతూ కనిపించింది. ఈ దృశ్యాలు లైవ్‌లో రికార్డయ్యాయి. 

ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో ఠీవిగా సంచరిస్తున్న జంతువు చిరుత పులి అని కొందరు, కాదు పెంపుడు పిల్లి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరేదైనా పెంపుడు జంతువు అయి ఉండొచ్చన్న వాదనలూ  వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

click me!