మోడీ ప్రభుత్వ ఒత్తిడితో ట్విట్ట‌ర్ నా ఫాలోయింగ్స్ కు లిమిట్ విధిస్తోంది - రాహుల్ గాంధీ

By team teluguFirst Published Jan 27, 2022, 11:13 AM IST
Highlights

నరేంద్ర మోడీ ప్రభుత్వ ఒత్తిడి వ‌ల్ల ట్విట్ట‌ర్ త‌న ఫాలోయింగ్స్ కు లిమిట్ విధిస్తోంద‌ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్ కు లేఖ రాశారు. 

రాహుల్ గాంధీ త‌న లేఖ‌లో ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. గతంలో త‌నకు నెల‌కు కొత్త‌గా రెండు లక్షల మంది ఫాలోవ‌ర్స్ వచ్చేవార‌ని తెలిపారు. అయితే  అయితే ఆగస్టు 2021 నుంచి త‌న‌ అనుచరుల సంఖ్య నెలకు కేవలం 2500 చొప్పున పెరుగుతోందని చెప్పారు. ప్ర‌స్తుతం తన ఫాలోవ‌ర్స్ సంఖ్య 19.5 మిలియన్ల వ‌ద్దే స్తంభించిపోయిందని ఆరోపించారు.

‘‘భారతదేశంలో నిరంకుశత్వం పెరగడానికి ట్విటర్ సహాయపడకుండా చూసుకోవాల్సిన బృహత్తరమైన బాధ్యత మీపై ఉంది’’ అని అగర్వాల్‌ను  ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే ఉదారవాద ప్రజాస్వామ్యం, నిరంకుశవాదం మధ్య సైద్ధాంతిక యుద్ధం రూపొందించబడింది. ఇలాంటి ప్రాంతాల్లో ట్విట్టర్ వంటి కంపెనీలకు భారీ బాధ్యత ఉంటుంది.’’  అని గాంధీ ఓ మీడియా సంస్థతో చెప్పారు. 

రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌ల‌పై ట్విట్ట‌ర్ స్పందించింది. ‘‘ ట్విట్టర్ లో ఫాలోవర్స్ లెక్కలు చూపించే ఫీచర్ చాలా జెన్యూన్, నిజమైనవని ప్రతీ ఒక్కరూ విశ్వసించాలని మేము కోరుకుంటున్నాము. Twitter ప్లాట్‌ఫారమ్ మానిప్యులేషన్, స్పామ్‌కు జీరో-టాలరెన్స్ విధానంతో పని చేస్తుంది. మేము స్పామ్ లను నివారించడానికి వ్యూహాత్మకంగా ఆటోమేషన్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ వాడుతాము. హెల్దీ సర్వీస్, క్రెడిబులిటీ అకౌంట్లను నిర్ధారించే ప్రయత్నాల్లో భాగంగా ఫాలోవర్స్ లో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంటుంది.’’ అని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు.

ఆగస్ట్‌లో కొంతకాలం నిలిచిపోయిన రాహుల్ గాంధీ అకౌంట్.. 
గ‌తేడాది ఆగస్టులో ఢిల్లీలో అత్యాచార బాధితురాలి కుటుంబానికి సంబంధించిన ఫొటోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దీంతో కొంత సేపు ఆయ‌న అకౌంట్ నిలిచిపోయింది. రాహుల్ గాంధీ ఈ ఫొటోను ట్వీట్ చేయ‌డం ప‌ట్ల  బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో మైక్రో బ్లాగింగ్ సైట్ నిబంధనలను ఆయ‌న ఉల్లంఘించార‌ని తెలుపుతూ ఎనిమిది రోజుల పాటు ట్విట్ట‌ర్ అకౌంట్ ను స‌స్పెండ్ చేసింది. 
 

click me!