
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అధికారిక పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఆయన రెండోసారి యూఎన్ సెక్రటరీ జనరల్ బాధ్యతలు చేపట్టిన తరువాత భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు ఐక్యరాజ్యసమితి చీఫ్ భారత్‌లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయన పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని అందజేసింది. అలాగే..ఈ సమయంలో ఆయన ప్రధాని మోదీని, విదేశాంగ మంత్రి జైశంకర్‌లతో భేటీ కానున్నారు.
భారతదేశ పర్యటనలో మొదటి రోజు.. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో 26/11 ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పిస్తారు. అనంతరం ఐఐటి ముంబైలో ఏర్పాటు చేసిన "75 ఇయర్స్ ఆఫ్ ఇండియా: యునైటెడ్ నేషన్స్-ఇండియా పార్టనర్‌షిప్: స్ట్రెంథనింగ్ సౌత్-సౌత్ కోఆపరేషన్" అనే అంశంపై ప్రసంగం చేస్తాడు.
ఇది ‘యుద్ధ యుగం’ కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ప్రపంచ సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సమర్థించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి పరిస్థితులను సృష్టించే ప్రయత్నాలను స్వాగతిస్తామని ఆయన అన్నారు. భారత పర్యటనకు ముందు.. ఉక్రెయిన్‌లో యుద్ధం తీవ్రతరం కావడం పట్ల తాను తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు గుటెర్రెస్ చెప్పారు.
సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సెప్టెంబర్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఇది యుద్ధానికి సమయం కాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తో శత్రుత్వాన్ని త్వరగా ముగించాలని పిలుపునిస్తూ ప్రధాని మోదీ.. ప్రజాస్వామ్యం,చర్చలు, దౌత్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.
భారత పర్యటనకు ముందు గుటెర్రెస్ మాట్లాడుతూ.. ఇది యుద్ధానికి సమయం కాదని రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ చెప్పినది పూర్తిగా నిజమని తాను భావిస్తున్నానని అన్నారు. యుద్ధానికి సమయం లేదు, ప్రత్యేకంగా యుద్ధ సమయం కాదని అన్నారు.
2022 జనవరిలో రెండవసారి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అయిన తర్వాత గుటెర్రెస్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. ప్రపంచ సంస్థకు అధిపతిగా తన మొదటి పదవీకాలంలో గుటెర్రెస్ అక్టోబర్ 2018లో భారతదేశాన్ని సందర్శించారు. తన పర్యటనలో ఉక్రెయిన్ యుద్ధం గురించి భారత నాయకత్వంతో చర్చించవచ్చా అని గుటెర్రెస్‌ని అడిగినప్పుడు? వివాదాస్పద అంశాలపై బహిరంగ ప్రకటనలు చేసే దౌత్యంపై తనకు నమ్మకం లేదని తెలిపారు.
అలాగే.. ఆయన మాట్లాడుతూ.. భారతదేశం నేతృత్వంలోని G20, రుణ పునర్వ్యవస్థీకరణ యొక్క సమర్థవంతమైన వ్యవస్థను అమలులోకి తెస్తుందని పూర్తిగా ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ వివాదం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మహమ్మారి మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిజమైన తుఫానును ఎదుర్కొంటున్నాయని కూడా ఆయన హెచ్చరించారు. డిసెంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2023 వరకు ఒక సంవత్సరం పాటు జి-20కి భారతదేశం అధ్యక్షత వహిస్తుంది.