
"కూతురి ఆరోగ్యం బాగాలేదు.. జాగ్రత్తగా చూసుకో.. " ఈ లోకంలో లేని ఓ తండ్రి ఆందోళన ఇది. కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన పైలట్ అనిల్ సింగ్ చివరిసారిగా తన భార్యతో మాట్లాడిన మాటలివి. ప్రమాదానికి ముందు.. ఫైలట్ తన భార్యకు ఫోన్ చేసిన మాట్లాడారు. తన చిన్నారి కుమార్తె ఆరోగ్యం సరిగా లేదని, తనని జాగ్రత్తగా చూసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫైలట్ చివరి సంభాషణను తన భార్య మీడియాకు పంచుకుంది. ఆయన చివరి సంభాషణ చాలా ఉద్వేగానికి లోను చేస్తోంది. గుండెలను పిండేస్తుంది. ఓ తండ్రికి తన కుతూరిపై ఉండే ప్రేమను తెలుపుతోంది. మంగళవారం కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ కూలిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో పైలట్, ఆరుగురు ప్రయాణికులు సహా ఏడుగురు మరణించారు.
కూతురిని జాగ్రత్తగా చూసుకో..
పైలట్ అనిల్ సింగ్ తన భార్య షిరీన్ ఆనందిత, కుమార్తె ఫిరోజా సింగ్‌తో కలిసి ముంబైలోని అంధేరి శివారులోని ఓ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నారు. భర్త మరణవార్త ఆనందితను కలిచివేసింది. ఆనందిత వృత్తి రీత్యా సినిమా రచయిత. ఆమె మీడియాతో మాట్లాడుతూ..భావోద్వేగానికి లోనైంది. తన భర్తతో చివరిసారి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంది. సోమవారం ఫైలట్ అనిల్ సింగ్ తనకు చివరి సారి కాల్ చేశాడని తెలిపింది. కూతురు ఆరోగ్యం బాగోలేదని అనిల్ తనకు చెప్పడనీ, కుతూరుని సరిగ్గా చూసుకోమని అన్నాడని తెలిపింది.
అదే సమయంలో ప్రమాద సంఘటనకు సంబంధించి ఆనందిత మాట్లాడుతూ.. ఇది ప్రమాదవశాత్తు జరిగినందున ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు.అనిల్ సింగ్ తూర్పు ఢిల్లీలోని షహదారా ప్రాంతానికి చెందినవాడు. ఆయన గత 15 సంవత్సరాలుగా ముంబైలో నివసిస్తున్నాడు. అదే సమయంలో.. ప్రమాదంలో మరణించిన పైలట్ సింగ్ ముంబై నివాసి అని ఉత్తరాఖండ్ పోలీసు అధికారి ధృవీకరించారు.తన భర్త అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె తన కుమార్తెతో కలిసి న్యూఢిల్లీకి బయలుదేరారు.
పొగమంచు కారణంగా ప్రమాదం..
ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కేదార్‌నాథ్ నుంచి యాత్రికులను తీసుకుని గుప్తకాశీ వైపు వెళుతోంది. కేదార్‌నాథ్ ధామ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడచట్టి సమీపంలో ప్రతికూల వాతావరణం, పొగమంచు కారణంగా విమానం కూలిపోయింది. గరుడచట్టిలోని దేవ్ దర్శని వద్ద ఉదయం 11.45 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ తెలిపారు.
దట్టంగా పొగ మంచు కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని అధికార ప్రాథమిక విచారణలో తెలింది. ఘటన గురించి సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత.. ఫ్యూయల్ ట్యాంకు పేలిపోవడంతో మంటలు చెలరేగాయనీ, ప్రమాదం సమయానికి హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నట్టు తెలుస్తోంది.
హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందనీ,పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ట్వీట్ చేశారు. అటు ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.
ప్రమాదంపై దర్యాప్తు
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB), ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA బృందాలు హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి. ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కొన్ని ఉల్లంఘనల కారణంగా రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఇది కాకుండా.. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి ప్రభుత్వం డిఎం రుద్రప్రయాగ్‌కు మెజిస్టీరియల్ విచారణను అప్పగించింది.