
Ujjain caste discrimination: దేశంలో కఠిన చట్టాలు, సామాజిక సంస్కరణలు అమలవుతున్నా నేటీకీ కుల వివక్ష అంతం కావడం లేదు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా కుల వివక్ష ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దళిత వరుడిని కొంతమంది అగ్రవర్ణ వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం జరిగినట్లు సమాచారం. ఆదివారం రాత్రి బర్దియా గ్రామంలో తన పెండ్లి ఊరేగింపు కొనసాగుతున్న క్రమంలో వరుడు మహర్బన్ పర్మార్ శ్రీ రాముడి ఆశీర్వాదం తీసుకోవడానికి ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నాడు. అయితే వరుడిని రాకుండా అతడిని అడ్డుకునే ఉద్దేశంతో ఆలయ ద్వారాలకు తాళాలు వేసి ఉన్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేసే కైలాష్ పర్మార్ అనే వ్యక్తికి కూడా సోమవారం ఇలాంటి అనుభవమే ఎదురైందని ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది.
తమను ఆలయంలోకి రాకుండా అడ్డగించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని నిందితుడితో కలిసి ఆల్ ఇండియా బలై ఫెడరేషన్ అనే కుల సంఘం డిమాండ్ చేస్తూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సత్యేంద్ర కుమార్ శుక్లా, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) సతోష్ ఠాగూర్‌లకు మెమోరాండం సమర్పించింది. ఈ విషయంపై స్థానిక రాజ్‌పుత్ సంఘం భట్‌పచ్లానా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సంజయ్ వర్మకు వివరణ ఇచ్చింది. పూజారి కుటుంబం లో ఒకరూ మృతి చెందడంతో ఆలయాన్ని మూసివేసినట్లు రాజ్‌పుత్ సంఘం సభ్యులు పోలీసులకు తెలిపారు. "ఆలయ పూజారి కుటుంబంలో ఒకరు చనిపోయారని, 'సూతక్' (కుటుంబ సభ్యుల మరణం తరువాత నిర్దిష్ట కాలం వరకు పూజలకు దూరంగా ఉండాలనే హిందూ విశ్వాసం) కారణంగా ఆలయం మూసివేయబడిందని రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు తెలియజేశారని సంజయ్ వర్మ పేర్కొన్నారు. వివాదం ముదరడంతో, సోమవారం నాడు SDM, SPOP సహా సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో వరుడు ఆలయాన్ని సందర్శించేలా చేశారు.