ఎన్నికల కమిషన్‌పై ఉద్ధవ్ ఠాక్రే టీమ్ సంచలన ఆరోపణలు.. ఎన్నికల గుర్తు కేటాయించడంలో పక్షపాతం.. 12 పాయింట్లతో లేఖ

By Mahesh KFirst Published Oct 13, 2022, 4:15 PM IST
Highlights

శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎన్నికల కమిషన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తమకు ఎన్నికల గుర్తును, పార్టీ పేరును కేటాయించినప్పుడు ఏక్‌నాథ్ షిండే వర్గానికి పక్షపాతంగా వ్యవహరించిందని పేర్కొంది. తాము ప్రతిపాదించిన పేర్లు, గుర్తులను షిండే టీమ్‌కు తెలిసేలా ఈసీ వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి డిలీట్ చేసిందని వివరించింది.
 

ముంబయి: ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన గ్రూప్ ఎన్నికల కమిషన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఎన్నికల గుర్తు, పార్టీ పేరును కేటాయించడంలో షిండే టీమ్‌కు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించింది. ఈ విషయంలో ఈసీ పక్షపాం వహించిందని సీరియల్ అలిగేషన్స్ చేసింది. ఈ మేరకు 12 పాయింట్లతో ఓ లేఖ రాసింది.

ఎన్నికల కమిషన్ పార్టీ పేర్లను, గుర్తులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం, ఆ తర్వాత డిలీట్ చేయడం వంటి చర్యల మూలంగా షిండే టీమ్‌కు తమ వ్యూహం అర్థం అయిందని ఉద్ధవ్ ఠాక్రే వర్గం తెలిపింది. డాక్యుమెంట్ల సమర్పణకు డేట్లు ముందుకు జరపడం వంటివి ప్రత్యర్థి వర్గానికి కలిసి వచ్చిందని పేర్కొంది. 

ఈసీ చేసిన చర్యల కారణంగా తాము కోరుకున్న మొదటి రెండు ప్రాధాన్యతల గుర్తులు ప్రత్యర్థి వర్గానికి తెలిసిపోయిందని, అందుకే వారి ప్రతిపాదనలోనూ మొదటి రెండు గుర్తులు అవే ఉన్నాయని ఆరోపించింది. తమ ప్రతిపాదనలో పేర్కొన్న పార్టీ పేర్లు, ఎన్నికల గుర్తులను షిండే టీమ్.. ఎన్నికల వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలిగిందని వివరించింది. అందుకే తామ చాయిస్‌లను షిండే టీమ్ కాపీ చేసుకోగలిగిందని పేర్కొంది.

ప్రతిపాదనలో ఉన్న పార్టీ పేర్లు, గుర్తులు బహిరంగపరచరాదన్నది తెలిసిందే. కానీ, తాము ప్రతిపాదించిన విషయాలను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి డిలీట్ చేయడం ద్వారా షిండేకు అనుకూలంగా ఒక సమాచారాన్ని పంపినట్టయిందని ఉద్ధవ్ ఠాక్రే టీమ్ పేర్కొంది.

Also Read: పార్టీ పేరు కోసం 40 మంది ద్రోహులు, వెన్నుపోటుదారుల బ‌రితెగింపు

ఆంధేరిలో ఉప ఎన్నిక కారణంగా శివసేన పార్టీ ఎవరిది? అనే విషయంపై ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ పార్టీ పేరును, ఎన్నికల గుర్తును ఫ్రీజ్ చేసింది. సుప్రీంకోర్టులో కేసు క్లియర్ అయ్యే వరకు తాత్కాలికంగా ఎన్నికల గుర్తును, పార్టీ పేరును కేటాయించడానికి ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్‌నాథ్ షిండే వర్గం కొత్త ఎన్నికల గుర్తులు, పార్టీ పేర్లను కోరుతూ ప్రతిపాదనలు పంపాయి.

చివరకు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కాగడా గుర్తు, పార్టీ పేరును శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రేగా ఈసీ కేటాయించింది. కాగా, ఏక్‌నాథ్ షిండేకు కత్తి డాలును ఎన్నికల గుర్తుగా కేటాయించింది. బాలాసాహెబ్ శివసేన పేరును ఇచ్చింది.

click me!