
మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శివసేన మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు జాతీయ ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎవరూ ఊహించని విధంగా శివసేన పార్టీ పేరును ఏక్ నాథ్ షిండే వర్గానికి కట్టబెట్టింది. అంతేకాకుండా.. పార్టీ గుర్తు విల్లు-బాణం గుర్తును కూడా ఏకనాథ్ షిండేకి ఇచ్చింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఈసీ కోలుకోని షాకిచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే తన ప్రత్యర్థి ఏక్నాథ్ షిండేపై విమర్శల దాడిని ప్రారంభించారు. సీఎం షిండేను "మారలేని ద్రోహి"గా అభివర్ణించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే 40 మందికి పైగా సేన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి, కాంగ్రెస్,నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో మిస్టర్ థాకరే కూటమి ప్రభుత్వం నుండి పార్టీని చేజిక్కించుకున్న దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. "వారు శివసేన చిహ్నాన్ని దొంగిలించారు. మేము పోరాడుతూనే ఉంటాము, మా ఆశల్ని కోల్పోము. ప్రస్తుతానికి షిండే తన దొంగతనంతో సంతోషంగా ఉండనివ్వండి. ఒకప్పుడు దేశద్రోహి, ఎల్లప్పుడూ ద్రోహి" అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈసీ నిర్ణణంపై మండిపడుతూ.. "ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకం" అని అన్నారు.
షిండే వర్గాన్ని ‘దొంగలు’ అని పిలిచి, ‘దొంగలు ఒకరోజు ఎంజాయ్ చేయనివ్వండి’ అని అన్నారు. అనంతరం తన పార్టీ కార్యకర్తలను అధైర్యపడవద్దని, పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైందని ఆరోపించారు. భారత ఎన్నికల సంఘం అధికార బీజేపీకి బానిసగా మారిందని విమర్శించారు. ఎన్నికల సంఘం చీఫ్‌ను ఎన్నుకునే విధానాన్ని కూడా మార్చాలని డిమాండ్ చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని నిర్ధారించడానికి సుప్రీంకోర్టు చివరి ఆశ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ఈసీ నిర్ణయం మేరకు ముంబై, ఇతర ప్రాంతాలలో త్వరలో పౌర ఎన్నికలు జరగనున్నాయని ఉద్ధవ్ థాకరే తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. అలాగే.. బిజెపిని టార్గెట్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం మహారాష్ట్రలో పనిచేయదనీ, కాబట్టి వారు తమ స్వలాభం కోసం వారి ముఖానికి బాలాసాహెబ్ ముసుగు వేసుకున్నారని, కానీ అది ముసుగు అని ప్రజలందరికీ తెలుసునని అన్నారు.
ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఇప్పుడు ప్రధాని ఎర్రకోట నుండి ప్రకటించాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఇది తన వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ ఉన్నప్పటికీ, ఉద్ధవ్ ఠాక్రే "బాలాసాహెబ్ ఠాక్రే పూజించే నిజమైన విల్లు , బాణం మా వద్దనే ఉంది" అని అన్నారు. వారు (టీమ్ షిండే) వీటిని కాగితంపై మాత్రమే కలిగి ఉన్నారనీ, తన తండ్రి బాల్ థాకరే శివసేనను స్థాపించారని గుర్తు చేశారు. గత ఏడాది తనపై తిరుగుబాటు చేసిన వారిలో 16 మంది సేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాము చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదనీ, అయినప్పటికీ పార్టీ పేరు,గుర్తుపై ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు వచ్చాయనీ, ఇది అన్యాయమని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. శివసేన మళ్లీ పుంజుకుంటుందనీ, ఇది అంతం కాదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.