
2 sisters shot dead over money dispute: దేశరాజధాని ఢిల్లీలోని ఆర్కేపురంలో డబ్బుల వివాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లను కాల్చి చంపారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్కేపురంలో జరిగిన కాల్పుల్లో పింకీ, జ్యోతి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అంబేడ్కర్ బస్తీలో జరిగిన కాల్పుల గురించి తెలియజేస్తూ ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు పీసీఆర్ కాల్ వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీలోని ఆర్కేపురం అంబేడ్కర్ బస్తీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ప్రధాన నిందితుడిని, అతని అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. "అంబేడ్కర్ బస్తీలో కాల్పులు జరిగినట్లు ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటలకు వచ్చిన పీసీఆర్ కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. కాల్ చేసిన వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం తన సోదరీమణులను కాల్చి చంపినట్లు పోలీసులు" తెలిపారు.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా పింకీ (30), జ్యోతి (29) అనే ఇద్దరు మహిళలకు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే వారిని ఎస్జే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దుండగులు ప్రధానంగా బాధితురాలి సోదరుడిని లక్ష్యంగా చేసుకున్నారనీ, అయితే వివాదంలో ప్రమాదవశాత్తు మహిళలను కాల్చి చంపారని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఈ దాడి వెనుక ఆర్థిక వివాదం లేదా సెటిల్మెంట్ సమస్యే కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఎల్జీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఆదివారం ట్విటర్ లో ఢిల్లీ సీఎం హిందీలో.. "మా ఆలోచనలు ఇద్దరు మహిళల కుటుంబాలతో ఉన్నాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి' అని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలను చక్కదిద్దాల్సిన వ్యక్తులు శాంతిభద్రతలను చక్కదిద్దడానికి బదులు మొత్తం ఢిల్లీ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ శాంతిభద్రతలు ఎల్జీకి బదులుగా ఆప్ ప్రభుత్వ హయాంలో ఉండి ఉంటే, ఢిల్లీ సురక్షితంగా ఉండేదని పేర్కొన్నారు.