కాంగ్రెస్‌లోకి కన్హయ్య కుమార్? రాహుల్‌తో సమావేశమైన స్టూడెంట్ లీడర్

By telugu teamFirst Published Sep 16, 2021, 3:31 PM IST
Highlights

సీపీఐ నేత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయవర్గాలు. ఈ నెల 14న కన్హయ్య కుమార్ రాహుల్ గాంధీతో సమావేశమే ఇందుకు సాక్ష్యమని చెబుతున్నారు.

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరనున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నెల 14న ఆయన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంపైనే రాజకీయవర్గాలు తాజా అంచనాలు వేస్తున్నాయి. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మెవానీ కూడా కాంగ్రెస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. వీరిరువురూ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.

కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా దీనిపై స్పందిస్తూ రాహుల్‌తో చాలా మంది కలుస్తుంటారని, అంతమాత్రానా పార్టీలో చేరుతారని చెప్పడం సరికాదని అన్నారు. ఏదైనా విషయముంటే తెలియజేస్తామని చెప్పారు. అటు సీపీఐ జనరల్ సెక్రెటరీ డీ రాజా కూడా తాను వదంతులే విన్నారని, కచ్చితమైన సమాచారం తనకు రాలేదని అన్నారు. కానీ, కొన్నివర్గాలు మాత్రం కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లోకి చేరనున్నట్టే చెబుతున్నాయి.

కాంగ్రెస్ బిహార్ చీఫ్ పేరును ప్రకటించిన తర్వాత కన్హయ్య కుమార్ ఎంట్రీపై అనౌన్స్‌మెంట్ ఉంటుందని కొన్నివర్గాలు తెలిపాయి. ఇప్పటికే పార్టీలో ఆయన ప్లేస్ గురించి చర్చ జరుగుతున్నట్టు వివరించాయి. కన్హయ్య కుమార్ సన్నిహితవర్గాలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సీపీఐలో కన్హయ్య కుమార్ కొన్ని చట్రాల్లో ఇరుక్కుపోయినట్టు ఫీల్ అవుతున్నారని తెలిపాయి.

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లోకి చేరవచ్చని సమాచారం. బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. బిహార్‌లోని బెగుసరాయి నుంచి లోక్‌సభకు పోటీ చేసి కన్హయ్య కుమార్ ఓడిపోయారు. అయితే, కన్హయ్యకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్నది. జేఎన్‌యూ విద్యార్థిగా ఆయన ఇచ్చిన ప్రసంగాలు చాలా మందిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బిహార్‌లో మళ్లీ పుంజుకోవడానికి కన్హయ్యను పార్టీలోకి తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. కాగా, కన్హయ్య వివాదాస్పద గతంతో పార్టీకి నష్టమేనని ఇంకొందరు చెబుతున్నారు.

click me!