
న్యూఢిల్లీ: రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉన్నది. ఈ సమావేశమే ఆ ఇద్దరు మంత్రులకు చివరివి అవుతాయా? లేక మంత్రులుగా కొనసాగుతారా? లేక మరే పదవులకైనా ఎంపిక అవుతారా? అనేది ఇంకా తెలియరాలేదు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, స్టీల్ మినిస్టర్ ఆర్సీపీ సింగ్‌ల ఇద్దరి గురించే ఈ అనిశ్చితి. వారి రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. కానీ, వారి పార్టీలు మాత్రం పెద్దల సభకు వారిని మళ్లీ పంపే ప్రతిపాదనలు చేయలేదు. ఒక వేళ వారిని మళ్లీ ఎంపీలుగా గెలిపించుకోకుంటే.. వారు కేంద్ర మంత్రులుగా దిగిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
ముక్తార్ అబ్బాస్ నఖ్వీని బీజేపీ రాజ్యసభ కోసం నామినేట్ చేయలేదు. కాగా, జనతా దళ్ యునైటెడ్ పార్టీ కూడా.. ఆ పార్టీ నేత ఆర్సీపీ సింగ్‌ను నామినేట్ చేయలేదు. ఆర్సీపీ సింగ్ జేడీయూ పార్టీ వీడి తమ సీనియర్ పార్ట్‌నర్ అయిన బీజేపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో జేడీయూ సారథి, బిహార్ సీఎం నితీష్ కుమార్.. ఆర్సీపీ సింగ్‌కు ప్రాధాన్యతను తగ్గించారు.
జులై 7వ తేదీన ఎంపీలుగా వారి పదవీ కాలం ముగిసినా.. వారు ఆరు నెలలు మంత్రులుగా కొనసాగవచ్చు. అంటే ఆరు నెలల్లోపు ఎంపీలుగా ఎన్నుకునే అవకాశం ఉంటే వారిని కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ, ప్రాక్టికల్‌గా ఇలా ఎంపీ పదవీ కాలం ముగిసినా మంత్రులుగా కొనసాగించడం అరుదుగా కనిపిస్తుంది.
దీంతో ఈ ఇద్దరు మంత్రుల భవిష్యత్‌పై చాలా రకాలుగా చర్చ జరుగుతున్నది. అందులో ఒకటి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. లేదా గవర్నర్‌గానైనా, లెఫ్టినెంట్ గవర్నర్‌గానైనా నియమించే అవకాశాలు ఉన్నాయని ఇంకొందరు ఊహిస్తున్నారు. కాగా, ఆర్సీపీ సింగ్ బీజేపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అలాగే, రాష్ట్రపతి ఎన్నిక జరిగిన తర్వాత కూడా ఎంపీల ఎన్నిక అవకాశం ఉన్నది. రాష్ట్రపతి సిఫారసులతో రాజ్యసభ సభ్యులుగా వారిని పంపి.. మంత్రులుగా కొనసాగించే అవకాశాలూ ఉన్నాయి.
ఉపరాష్ట్రపతి పోస్టు కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్డీయే కూటమి త్వరలోనే తమ క్యాండిడేట్‌ను ప్రకటించే అవకాశం ఉన్నది.