కేరళలో నిపా కలకలం: మరో ఇద్దరిలో వైరస్ లక్షణాలు.. కాంటాక్ట్ లిస్టులో 188 మంది

By telugu teamFirst Published Sep 5, 2021, 4:48 PM IST
Highlights

నిపా వైరస్‌తో 12ఏళ్ల బాలుడు మరణించిన ఘటన కేరళలో కలకలం రేపుతున్నది. తాజాగా, మరో ఇద్దరు హెల్త్ వర్కర్‌లలో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. మృతుడితో కాంటాక్ట్ అయినవారిగా 188 మందిని గుర్తించారు. ఇందులో 20 మంది హైరిస్క్ ఉన్నవారిగా పేర్కొంటున్నారు.

కోజికోడ్: ఒకవైపు కరోనాతో విలవిల్లాడుతున్న కేరళలో మరో వైరస్ కలకలం రేపింది. నిపా వైరస్‌తో 12ఏళ్ల బాలుడు మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. మృతుడితో అనుసంధానంలోకి వెళ్లిన వారి జాబితాను తయారు చేసింది. ఇందులో 188 మంది ఉన్నారు. వీరిలో 20 మంది నిపా సోకడానికి హైరిస్కు ఉన్నవారు. 12ఏళ్ల బాలుడి మృతి నుంచి తేరుకోకముందే మరో ఇద్దరిలో నిపా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు కేరళలోనే రిపోర్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఆదివారం కోజికోడ్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడారు. కొత్తగా ఇద్దరు హెల్త్‌కేర్ వర్కర్‌లలో నిపా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఇందులో ఒకరు కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారని, మరొకరు ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో సేవలందిస్తున్నారని వివరించారు. మృతి చెందిన 12ఏళ్ల బాలుడు పజూర్‌కు చెందిన చాతమంగలం నివాసుడు. నిపాతో బాలుడు మరణించడంతో పజూర్ లోకల్‌వార్డును పూర్తిగా మూసేశారు.

శుక్రవారం తెల్లవారుజామున నిపా వైరస్‌తో మరణించిన 12 ఏళ్ల బాలుడు తొలుత ఓ క్లినిక్‌లో అనంతరం మూడు హాస్పిటల్‌లలో చేరాడు. దీంతో కాంటాక్ట్ లిస్టు పెరిగింది. ఆ బాలుడితో నేరుగా అనుసంధానంలోకి వెళ్లినవారి సంఖ్య పెరగడం ఆందోళనను పెంచుతున్నది.

పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కోజికోడ్ మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్‌(కేఎంసీహెచ్)కు చేరుతుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. కేఎంసీహెచ్‌లోని మూడో అంతస్తు పేవార్డ్ బ్లాక్‌ను నిపా కోసం ప్రత్యేకంగా కేటాయిస్తామని, హైరిస్క్ పేషెంట్లను, హెల్త్ వర్కర్లను ఇక్కడికే షిఫ్ట్ చేస్తామని తెలిపారు. ఈ కార్యకలాపాల కోసం కోజికోడ్ గెస్ట్ హౌజ్‌లో ప్రత్యేక 24గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వివరించారు.

click me!