
చెన్నై: తమిళనాడులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పేదరికంలో మగ్గిన ఆ కుటుంబం.. తల్లి, భర్త మరణించిన వారిని కనీసం ఖననం చేయడానికి డబ్బుల్లేక విలవిల్లాడిపోయింది. అంతిమ క్రియలు కూడా నిర్వహించే పరిస్థితిలో లేని ఆ కుటుంబం ఇద్దరి మృతదేహాలను అలాగే ఇంటిలో ఉంచుకుంది. వారం తర్వాత ఇంటిలోని శవాల నుంచి దుర్వాసన ఎక్కువైంది. దీంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు ఆ మృతదేహాలను ఖననం చేసిన ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
గోపిచెట్టిపాలయంలో శాంతి, మోహనసుందరం దంపతులు ఉండేవారు. వారికి మానసిక లోపమున్న కుమారుడు శరవణ కుమార్, కూతురు శశిరేఖ ఉన్నారు. శశిరేఖ కష్టపడి కుటుంబ భారాన్ని మోసింది. ఆమె పెళ్లి చేసుకునే వరకు కూలీ పనులు చేసి పోషించింది. కానీ, ఆమె అత్తవారింటికి వెళ్లిన తర్వాత ఆమె కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఇంటిలో శాంతి, మోహనసుందరం, వారి కుమారుడు శరవణ కుమార్, వయసు మీద పడ్డ శాంతి తల్లి కూడా ఉన్నారు.
Also Read: పట్టపగలే నడివీధిలో కత్తులతో ఇద్దరిపై దాడి.. ఒకరు స్పాట్ డెడ్.. భయానక వీడియో ఇదే
కష్టపడి పని చేసే వారు లేకపోవడం, డబ్బులు సంపాదించలేకపోవడంతో ఆ కుటుంబం దినదిన గండంగా బతుకుతున్నది. ఇరుగు పొరుగు వారు పెడుతున్న ఆహారంతో సర్దుకుపోయేవారు. ఈ నేపథ్యంలోనే ఆరు రోజుల కింద మోహనసుందరం, శాంతి తల్లి కనకాంబాళ్ తిండిలేక మరణించారు. వారి డెడ్ బాడీలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా స్తోమత లేక శాంతి తన భర్త, తల్లి మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకుంది. దుర్వాసన రావడంతో కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు ఆ డెడ్ బాడీలను రికవరీ చేసుకుని పోస్టుమార్టం అనంతరం ఖననం చేశారు.