ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్ ఖేరీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా.. పలువురు గాయపడ్డారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్ ఖేరీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
లకింపూర్ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆదివారం హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా.. మరో 8 మంది గాయపడ్డారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. కారుతో రైతులను ఢీకొట్టిన ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు మూడు వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు రైతులపై కాన్వాయ్ దూసుకెళ్లడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయిత్ ఖండించారు.