బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్, హెల్పర్ సజీవదహనం.. ఆ తప్పిదమే కారణమా..?

By Sumanth KanukulaFirst Published Oct 25, 2022, 10:11 AM IST
Highlights

జార్ఖండ్‌లోని రాంచీలో సోమవారం అర్దరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఓ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. 

జార్ఖండ్‌లోని రాంచీలో సోమవారం అర్దరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఓ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మృతులను మదన్ మహతో, ఇబ్రహీంలుగా గుర్తించారు. వారు బస్సు డ్రైవర్, హెల్పర్‌గా చెబుతున్నారు. వివరాలు.. దీపావళి రోజు రాత్రి రాంచీలోని ఖడ్గరహ బస్టాండ్ వద్ద ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

అనంతరం బస్సులో పూర్తిగా కాలిపోయిన రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రమాదానికి గురైన బస్సు రాంచీ- సిమ్‌డేగా మార్గంలో నడిచేది. దీపావళి కావడంతో రాత్రి దీపం వెలిగించి బస్సులో ఉంచడం వల్ల మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. 

డ్రైవర్, హెల్పర్ బస్సులో దీపం వెలిగించి నిద్రపోయారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ నిద్రలోకి జారుకున్న సమయంలో మంటలు చెలరేగాయని.. అయితే బస్సు డోర్లు మూసివేసి ఉండటంతో వారు బయటకు రాలేకపోయారని తెలుస్తోంది. దట్టమైన పొగలు రావడంతో ఇద్దరూ స్పృహతప్పి పడిపోయి ఉంటారని.. అనంతరం మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారని అంచనా వేస్తున్నారు.

click me!