గాజు సీసాలో టపాసులు పేల్చొద్దన్నందుకు.. వ్యక్తిని కత్తితో పొడిచిన మైనర్లు, చికిత్స పొందుతూ మృతి...

By SumaBala BukkaFirst Published Oct 25, 2022, 6:44 AM IST
Highlights

గాజు సీసాలో టపాసులు పేల్చొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశారు. 

ముంబై :  దీపావళి వేళ మహారాష్ట్రలోని ముంబైలో దారుణ ఘటన వెలుగు చూసింది. జీవితాల్లో వెలుగులు నింపాల్సిన దీపావళి..నలుగురి జీవితాల్లో అంధకారం నింపాయి. ఇటీవలి కాలంలో మైనర్లు చేస్తున్న నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారిని వద్దు అంటే చాలు... రెచ్చిపోతున్నారు. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు అన్నింట్లోనూ కనిపిస్తున్నారు. ఇది చాలా భయాందోళనలు కలిగించే విషయం. అలా మైనర్లు క్షణికావేశంలో దీపావళిని చీకటిమయం చేశారు. 

విషయంలోకి వెడితే.. గ్లాస్ బాటిల్ లో టపాసులు కాల్చడాన్ని అడ్డుకోవడమే అతడి పాలిట మృత్యుపాశమయ్యింది. గ్లాసు పేలి గాజు ముక్కలు ఎవరికి గుచ్చుకుంటాయో.. ఏ అపాయం ముంచుకొస్తుందో.. అన్న ఆలోచన అతడిని విగతజీవిగా చేసింది. దీపావళి వేడుకలు అందరి ఇంట్లో సంతోషం నింపితే.. ఆ వ్యక్తి కుటుంబంలో మాత్రం తీరని శోకాన్ని మిగిల్చింది. దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.  టపాసులు కాలుస్తూ, బాణసంచా వెలుగుల్లో ప్రజలు ఆనంద పరవశులయ్యారు. అయితే ఈ వేడుకల్లో జరిగిన ఓ చిన్న వివాదం వ్యక్తి ప్రాణాలు తీసింది.

క్రాకర్లపై నిషేధం ఉన్నప్పటికీ తగ్గని ఢిల్లీ వాసులు .. ప్రమాదకర స్థాయికి చేరుకున్న ఎయిర్ క్వాలిటీ

టపాసులు కాల్చడాన్ని అడ్డుకున్నందుకు ముగ్గురు మైనర్లు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, కత్తులతో పొడిచి చంపారు. ఈ సంఘటన ముంబైలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని ఇరవై ఒక్క ఏళ్ల సునీల్ శంకర్ నాయుడుగా గుర్తించారు. ముంబైలోని శివాజీ నగర్ లో 12 ఏళ్ల బాలుడు గ్లాస్ బాటిల్ లో టపాసులు పెట్టి పేలుస్తున్నాడు. తన ఇంటి సమీపంలో కాలుస్తుండడంతో గమనించిన సునీల్ నాయుడు అక్కడికి వచ్చి ఆ బాలుడికి అడ్డుచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ గొడవ గమనించి బాలుడి అన్న (15యేళ్లు),  అతని స్నేహితులు (14)తో అక్కడికి చేరుకుని ముగ్గురూ కలిసి బాధితుడిని కొట్టారు. ఈ క్రమంలో బాలుడి అన్న కత్తితో ఆ వ్యక్తిని పొడిచాడు. తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీల్ నాయుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  వ్యక్తి మృతికి కారణమైన బాలుడి అన్న, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. మరో బాలుడి కోసం గాలింపు చేపట్టారు.

click me!