
గ్రేటర్ నోయిడా: నిర్మాణంలో ఉన్న రెండు భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. శిథిలాల కింద 50 మంది దాకా చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రేటర్ నోయిడాలోని షా బేరీ గ్రామంలో మంగళవారం పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ రెండు భవనాల యజమానిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అన్వేషణ ప్రారంభించాయి. బాధితులను రక్షించడానికి సహాయ చర్యలు కొనసాగుతాయని ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ పికె శ్రీవాస్తవ చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో కనీసం 20 మంది కార్మికులు భవనం లోపల ఉండి ఉంటారని అనుమానిస్తున్నట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ అరుణ్ కుమార్ సింగ్ చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని కేంద్ర మంత్రి మహేష్ శర్మ చెప్పారు. 12 అంబులెన్స్ లను సంఘటనా స్థలంలో ఉంచారు. సమీపంలోని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.
సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. జిల్లా మెజిస్ట్రేట్ తో మాట్లాడి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను రప్పించాలని చెప్పారు.