నిబంధనలు పాటించని అకౌంట్లపై ట్విట్టర్ కొరడా.. భారత్‌లో 48,624 ఖాతాలపై నిషేధం..

By Sumanth KanukulaFirst Published Jan 2, 2023, 4:53 PM IST
Highlights

ఎలన్ మస్క్ నేతృత్వంలో కొనసాగుతున్న ట్విట్టర్ యాజమాన్యం నిబంధనలను అమలు చేయడంతో పాటుగా, ఫిర్యాదులపై కూడా వేగంగా స్పందిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 మధ్య కాలంలో భారత్‌లోని 48,624 ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ నిషేధించింది

ఎలన్ మస్క్ నేతృత్వంలో కొనసాగుతున్న ట్విట్టర్ యాజమాన్యం నిబంధనలను అమలు చేయడంతో పాటుగా, ఫిర్యాదులపై కూడా వేగంగా స్పందిస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన ట్విట్టర్ ఖాతాలపై కొరడా ఝుళిపిస్తోంది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 మధ్య కాలంలో భారత్‌లోని 48,624 ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ నిషేధించింది. పిల్లల లైంగిక దోపిడి, న్యూడ్​ వీడియోలకు సంబంధించి..  45,589 అకౌంట్స్​ని నిషేధించింది.  అలాగే.. తన ప్లాట్‌ఫారమ్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 3,035 ఖాతాలను కూడా తొలగించింది.

కొత్త IT రూల్స్- 2021కి అనుగుణంగా ట్విట్టర్ తన నెలవారీ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. వారి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగానికి అదే సమయంలో భారతదేశంలోని వినియోగదారుల నుండి 755 ఫిర్యాదులు అందాయి. వీటిలో 121 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్టుగా ట్విట్టర్ పేర్కొంది. వీటిలో కోర్టు ఆదేశాలతో పాటు వ్యక్తిగత వినియోగదారుల నుంచి స్వీకరించబడిన ఫిర్యాదులు ఉన్నాయని తెలిపింది. 

భారతదేశం నుండి చాలా ఫిర్యాదులులో.. దుర్వినియోగం/వేధింపు (681), ఐపీ-సంబంధిత ఉల్లంఘన (35), ద్వేషపూరిత ప్రవర్తన (20), గోప్యతా ఉల్లంఘన (15) ఉన్నాయి. ఖాతా సస్పెన్షన్‌లను అప్పీల్ చేసిన 22 ఫిర్యాదులను కూడా ప్రాసెస్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. ‘‘ఇవన్నీ పరిష్కరించబడ్డాయి. తగిన ప్రతిస్పందనలు పంపబడ్డాయి. మేము పరిస్థితికి సంబంధించిన ప్రత్యేకతలను సమీక్షించిన తర్వాత ఈ ఖాతా సస్పెన్షన్‌లలో దేనినీ రద్దు చేయలేదు. అన్ని ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి," అని కంపెనీ తెలిపింది.

కొత్త IT రూల్స్ 2021 ప్రకారం.. 5 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న పెద్ద డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు.. ప్రతి నెలా ఒక నివేదికను జారీ చేయాలి. 

click me!