లాక్ డౌన్ కారణంగా పనిలేకపోవటంతో, ఇంటికి పరిమితం కావడంతో డిప్రెషన్ కు గురై మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ టీవీ నటి ఆత్మహత్య చేసుకుంది. క్రైమ్ పెట్రోల్ నటించిన ప్రేక్ష మెహతా ప్రాణాలు తీసుకుంది.
ఇండోర్: ప్రముఖ టీవీ నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు. క్రైమ్ పెట్రోల్, మెరీ దుర్గా, లాల్ ఇష్క్ వంటి పాపులర్ టీవీ షోల్లో నటించిన ఆమె తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు 25 ఏళ్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో ఈ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.
గత కొంత కాలంగా ఆమె డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు హీరానగర్ పోలీసు స్టేషన్ ఇంచార్జీ రాజీవ్ భాదౌరియా చెప్పారు. తన గదిలోని ఫ్యాన్ కు వేలాడుతూ మంగళవారం ఉదయం ప్రేక్ష మెహతా తన కుటుంబ సభ్యులకు కనిపించిందని ఆయన చెప్పారు.
పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన కేరీర్ పట్ల, సంబంధాల పట్ల ఆమె ఆ నోట్ లో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని, సమగ్ర విచారణ జరుపుతామని బౌదౌరియా చెప్పారు.
ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్టులో ఆమె తన మరణానికి సంబంధించిన సంకేతాన్ని ఇచ్చారు. మరణ స్వప్నం అత్యంత దారుణమైందని ఆమె తన పోస్టులో పెట్టారు.
దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో టీవీ నటులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనల్లో ఇది రెండోది. మే 15వ తేదీన మన్ మీత్ గ్రేవాల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదత్ సే మజ్బూర్, కుల్దీపక్ వంటి షోలో నటించారు.