bharatiya nyaya sanhita : ట్రక్కు డ్రైవర్ల సమ్మె .. ‘‘ హిట్ అండ్ రన్ ’’ నిబంధనపై వెనక్కి తగ్గిన కేంద్రం

By Siva KodatiFirst Published Jan 2, 2024, 10:02 PM IST
Highlights

ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ హిట్ అండ్ రన్ కొత్త నిబంధనలపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ కొత్త లా పై హోం మంత్రిత్వ శాఖ స్టే విధించింది. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ 106/2ని అమలు చేసే ముందు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చించి, ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని అజయ్ భల్లా పేర్కొన్నారు. 
 

ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ హిట్ అండ్ రన్ కొత్త నిబంధనలపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ కొత్త లా పై హోం మంత్రిత్వ శాఖ స్టే విధించింది. హిట్ అండ్ రన్ కేసు కొత్త నిబంధనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మెకు దిగడంతో జన జీవనానికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం స్పందించింది. దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల సమ్మె, హిట్ అండ్ రన్ కొత్త నిబంధనపై ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చించామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. కొత్త నిబంధన ఇంకా అమలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ 106/2ని అమలు చేసే ముందు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చించి, ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని అజయ్ భల్లా పేర్కొన్నారు. 

అసలు ఇంతకీ హింట్ రన్ నిబంధన ఏంటీ..?

Latest Videos

కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం .. హిట్ అండ్ రన్ , ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. ఇందులోని సెక్షన్ 104లో రెండు నిబంధనలు వున్నాయి. దీని ప్రకారం నిర్లక్ష్యంగా వాహనం నడిపి, వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశం వుంది. ఇది మొదటి నిబంధన కాగా.. రెండో దాని ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు యాక్సిడెంట్ గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. దీనిని ఉల్లంఘించి అక్కడి నుంచి పారిపోతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం వుంది. ఈ నిబంధనలను భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304ఏ కిందకు తీసుకొచ్చారు. 

ఈ నిబంధనలనే ట్రక్కు డ్రైవర్లు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో పదేళ్ల పాటు కుటుంబాలకు దూరంగా వస్తుందని, అదే జరిగితే తమ ఫ్యామిలీలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు..రూ.7 లక్షల జరిమానా చెల్లించడం కూడా తమ వల్ల కాదని డ్రైవర్లు చెబుతున్నారు. ఈ నిబంధనల వల్ల కొత్తగా డ్రైవర్ వృత్తిని చేపట్టేవారు వుండరని, ఇది పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులను తెస్తుందని హెచ్చరిస్తున్నారు. వీటిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష, జరిమానా తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా దేశంలోని అనేక నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు అవుతూ వుండగా.. పెట్రోల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ సరఫరా చేసే ట్యాంకులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈ పరిస్ధితి తలెత్తింది. అంతేకారు వీరి సమ్మె కారణంగా రోజువారీ ప్రయాణాలు, నిత్యావసర సరుకుల రవాణా, పాఠశాలలపైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం, అధికారులు స్పందించడంతో కొన్ని చోట్ల ట్రక్కు డ్రైవర్లు ఆందోళన విరమిస్తున్నారు. 

click me!