
బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకునే బాధ్యతల్లో ఆ పోలీసు కానిస్టేబుల్ ఉన్నాడు. చెక్ పోస్ట్ వద్దకు వచ్చిన లారీలను తనిఖీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీ ఆ పోలీసు కానిస్టేబుల్ పై నుంచి దూసుకెళ్లింది. పోలీసు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కాలబురగి జిల్లాలోని హుల్లూరు గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
నెలోగీ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మయూర్ భీము చౌహాన్ (51) హుల్లూరు గ్రామ పరిధిలో రోడ్డు పై ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఉన్నారు. ఆ దారి గుండా ఇసుక అక్రమ తరలింపు జరుగుతున్నదనే సమాచారంతో వారు తనిఖీలు చేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపును మయూర్ భీము చౌహాన్ అడ్డుకోవాలని అనుకున్నారు. అక్కడికి వస్తున్న లారీలో ఏమున్నదో పరిశీలించి దాని, ట్రాన్స్‌పోర్టేషన్ అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరీక్షించాలని చూశారు. కానీ, ఆ ఇసుక లారీ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. అడ్డుగా వచ్చిన పోలీసు కానిస్టేబుల్ పై నుంచి దూసుకుపోనిచ్చాడు.
నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఎస్పీ ఇషా పంత్ తెలిపారు.
Also Read: మహిళల లోదుస్తులు దొంగిలించి హస్తప్రయోగం చేసుకుంటున్న సైకో.. వీడియో తీసి పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
జిల్లా ఇంచార్జీ ప్రియాంక్ ఖర్గే అక్కడి పరిస్థితులను, ఘటన గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి పరిహారం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు.
తాను డీఎస్పీ, ఎస్పీలతో మాట్లాడానని, ఈ కేసులో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్టూ ప్రియాంక్ ఖర్గే వివరించారు.