మావోయిస్టు ఏరియాలో దాబా నడుపుతున్న మహిళలు.. ఎలా సాధ్యమైంది?

By Mahesh KFirst Published Sep 12, 2022, 1:33 AM IST
Highlights

మావోయిస్టు ప్రాబల్య దంతేవాడ జిల్లాలో గిరిజన మహిళలు ముందడుగు వేశారు. సాధికరత దిశగా వారు ఓ దాబాను ఏర్పాటు చేశారు. నెలకు కనీసం రూ. 5వేల నుంచి రూ. 6 వేల వరకు సంపాదిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ పథకం ద్వారా జిల్లా కలెక్టర్ సహకారంతో కార్యరూపం దాల్చింది. వీరికి జిల్లా మినరల్ ఫౌండేషన్ నిధులు అందించడం గమనార్హం.

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్ అనగానే... అందులోనూ ముఖ్యంగా దంతేవాడ అనగానే చాలా మంది మావోయిస్టుల ప్రస్తావన తెస్తారు. ఎందుకంటే.. ఆ ఏరియాలో వారి ప్రాబల్యం ఎక్కువ. బయటి వరకు అక్కడకు వెళ్లాలంటే వణికిపోతారు. అధికారుల్లోనూ ఎంతో కొంత భయం ఉంటుంది. అలాంటి చోట మహిళలు సాధికారత వైపు అడుగేశారు. ఇంటి పనితోపాటు బయటి పనిలోనూ భాగస్వామ్యం పెంచుకుంటున్నారు. దంతేవాడ జిల్లాలో బడే కర్లీ గ్రామంలో గీదం బీజాపూర్ రోడ్ ‌పై మే నెలలో వాళ్లు ఒక దాబా ప్రారంభించారు. దాని పేరు మన్వ దాబా (మా దాబా).

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పెంచడానికి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా వీరికి కొంత ఆర్థిక సహకారం అందించారు. గౌతన్‌కు పక్కనే 3000చదరపు అడుగుల వైశాల్యంతో ఈ దాబాను పెట్టారు. ఈ దాబా కోసం జిల్లా మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) నిధులు సమకూర్చడం గమనార్హం.

ఈ దాబాను బాస్ బోదిన్ అనే మహిళా సహకార సంఘానికి చెందిన పది మంది మహిళలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వీరు కేవలం ఇంటి పని, పంట పనికే పరిమితమైనవారు. ఇప్పుడు ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబటానికి అడుగులు వేశారు.

ఈ గ్రూపునకు చెందిన అర్చన కుర్రమ్ మాట్లాడుతూ, ‘గతంలో మా కుటుంబం కేవలం వ్యవసాయ పనులు మాత్రమే చేసుకునేవారం. సాగు మీదనే ఆధారపడి బతికే వాళ్లం. కానీ, నేను సహకార సంఘంలో చేరిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌతన్‌లో ఆవు పేడ విక్రయించి మంచి ఆదాయం సంపాదించాం. ఇప్పుడు దాబా ద్వారా కూడా మంచి ఆదాయం వస్తున్నది’ అని వివరించారు. 

ఈ దాబాలో వెజ్, నాన్ వెజ్ రెండు రకాల భోజనాలు అందుబాటులో ఉంచుతున్నారు. స్వల్ప సమయంలోనే ఇది మంచి ఆదరణ పొందింది. ఒక్కోసారి రోజుకు రూ. 20 వేలు కూడా సంపాదిస్తున్నట్టు జిల్లా అధికారులు వివరించారు. ఇప్పటి వరకు రూ. 8 లక్షల బిజినెస్ చేసింది. 

ఈ దాబా వల్ల వారు ఒక్కొక్కరు నెలకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు సంపాదిస్తున్నారు. మహిళలు స్టీరియోటైపులు బ్రేక్ చేసుకుని వచ్చారని, ఈ గిరిజన మహిళలు పురుషుల ప్రాబల్యం ఉన్న సెక్టార్‌లో అడుగుపెట్టారని జిల్లా కలెక్టర్ వినిత్ నదన్‌వార్ తెలిపారు.

click me!