ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం.. ట్రావెన్‭కోర్ సంచలన నిర్ణయం 

Published : May 24, 2023, 02:31 AM IST
 ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం.. ట్రావెన్‭కోర్ సంచలన నిర్ణయం 

సారాంశం

Travancore Devaswom Board: కేరళలోని ఆలయాలను నిర్వహిస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం.. బోర్డ్ పరిధిలోని దేవాలయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించింది. బోర్డు పరిధిలోని ఆలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తే ఆయా ఆలయాల కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

Travancore Devaswom Board: కేరళలోని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ బోర్డు పరిధిలోని కేరళ దేవాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ శాఖ కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఈ మేరకు   ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) తన పరిధిలో ఉన్న త్తం 1248 ఆలయాలకు సర్క్యులర్‌లు జారీ చేసింది. ఆలయాల్లో కేవలం మతపరమైన పూజలు, కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని పేర్కొంది. ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు లేదా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శాఖకు అనుమతి ఇవ్వకూడదని స్ఫష్టం చేసింది. ఆదేశాలను పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని  బోర్డు స్పష్టం చేసింది. 


ఆలయ ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆయుధ శిక్షణను నిషేధిస్తూ 2016లో ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. తర్వాత మార్చి 30, 2021న, మళ్లీ సర్క్యులర్ జారీ చేయడం ద్వారా ఆర్డర్‌ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అలాగే, ఆలయ ప్రాంగణాన్ని ఆచారాలు , పండుగలకు మినహా మరే ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని సర్క్యులర్ నిషేధించింది. ఆదేశాల తరువాత కూడా రాష్ట్రంలోని కొన్ని ఆలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బోర్డు గుర్తించడంతో మే 18న తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ శాఖ, ఆయుధ శిక్షణ , అభ్యాసం నిషేధించబడ్డాయి.

ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు మినహా మరే ఇతర కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, ఏ సంస్థ రాజకీయ పార్టీలకు అనుమతి లేదని దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలను నిషేధించి ప్రధాన కార్యాలయానికి నివేదించేలా చర్యలు తీసుకోవాలని బోర్డు అధికారులను కోరారు. ఆ తర్వాత కూడా దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే సామాన్యులు కూడా బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది.

ప్రతిపక్షాల మద్దతు 

కాంగ్రెస్ నేత, సభలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు ఆదేశాలను సమర్థించారు. సర్క్యులర్‌కు తాను కూడా మద్దతిస్తున్నానని ఆయన అన్నారు. 2021లో కూడా అలాంటి సర్క్యులర్ జారీ చేసినా ఆర్‌ఎస్‌ఎస్ దానిని ఉల్లంఘించిందనీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతోందనీ, ప్రజల మధ్య విభజనను సృష్టిస్తోందని ఆరోపించారు. ఆలయ ప్రాంగణాన్ని అలాంటి పనులకు ఉపయోగించకూడదనీ, ఇది చాలా పవిత్రమైన ప్రదేశమని తెలిపారు.

కేరళలో దాదాపు 90% మంది హిందువులు సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా ఉన్నారని కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీశన్ అన్నారు. అందుకే ఆలయ ప్రాంగణంలో ఎలాంటి కార్యకలాపాలపై నిషేధం సరైనదేనని పేర్కొన్నారు. ఆలయాల లోపల అన్ని రకాల డ్రిల్‌లు, ఇతర కార్యక్రమాలను నిలిపివేయాలన్నారు. దేవాలయాలు భక్తుల ఉమ్మడి ఆస్తి అని తెలిపారు.

ఆలయ ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్ శారీరక శిక్షణ ఇస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. అయితే.. పినరయి తన కుటుంబ సభ్యులను సంతృప్తి పరచాలని.. ఇలాంటి ప్రకటన చేస్తున్నరని బిజెపి కేరళ ఉపాధ్యక్షుడు కెఎస్ రాధాకృష్ణన్ అన్నారు. తన అల్లుడు పీఏ మహమ్మద్ రియాస్ మత ప్రయోజనాలను కాపాడే ప్రయత్నంలో పినరయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 

ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు  

ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) కేరళ రాష్ట్రంలో 1248 దేవాలయాలను నిర్వహిస్తోంది. ఇది ఒక స్వతంత్ర సంస్థ. ఇది 1950 నాటి ట్రావెన్‌కోర్ కొచ్చిన్ హిందూ మత సంస్థల చట్టం XV ప్రకారం ఏర్పడింది. ప్రసిద్ధ శబరిమల ఆలయ ఆచార వ్యవహారాలన్నీ కూడా ఈ బోర్డు ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇది కాకుండా.. కేరళలో గురువాయూర్, మలబార్, కొచ్చిన్ మరియు కూడల్మాణిక్యం బోర్డులు కూడా ఉన్నాయి. ఐదు బోర్డులు కలిపి దాదాపు 3,000 దేవాలయాలను నిర్వహిస్తాయి. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !