పెళ్ళి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురయ్యి భారీ ప్రాణనష్టం జరిగింది. ఈ దుర్ఘటన ఉత్తరా ఖండ్ లో చోటుచేసుకుంది.
ఉత్తరా ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 25 నుండి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం.
ఉత్తరా ఖండ్ పౌరి జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం శుక్రవారం పెళ్లి బృందం బస్సులో బయలుదేరింది. ఇలా హరిద్వార్ సమీపంలోని లల్ ధంగ్ ప్రాంతంనుండి పౌరి జిల్లా బిరోన్కల్ గ్రామానికి చేరువయ్యాయి. మరో రెండు కిలోమీటర్లలో గమ్యస్థానానికి చరుకుంటారనగా దారుణం జరిగింది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.
undefined
ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 నుండి 50 మంది వున్నట్లు తెలుస్తోంది. వీరిలో 30 మంది వరకు ఘటనా స్థలంలోనే ప్రానాలు కోల్పోయినట్లు సమాచారం. మిగతావారు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు... వీరిలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
నిన్న(శుక్రవారం) రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో టార్చ్ లైట్లు, మొబైల్ ఫోన్స్ వెలుతురులో సహాయక చర్యలు కొనసాగాయి.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమై వుంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. అయితే ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. మృతుల వివరాలను తెలుసుకుని వారి కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.