యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో అంచనాలకు మించి సక్సెస్ కావడంతో యోగి సర్కార్ ఉత్సాహంగా ఉంది. ఈ విజయం తర్వాత, రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో ట్రేడ్ షోలను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
లక్నో : యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో గ్రాండ్ సక్సెస్ కావడంతో యోగి సర్కార్ రెట్టించిన ఉత్సాహంతో వుంది. అంతర్జాతీయ స్థాయిలో మాదిరిగానే రాష్ట్రస్థాయిలోనూ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో ట్రేడ్ షో ల ఏర్పాటుకు యోగి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి రాకేష్ సచాన్ ఈ మేరకు కీలక ప్రకటన చేసారు.
యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో అంచనాలకు మించి సక్సెస్ అయ్యిందని ..రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించిందని మంత్రి పేర్కొన్నారు. 2023లో జరిగిన మొదటి ఎడిషన్‌తో పోలిస్తే రెండవ ఎడిషన్ అధిక ఫలితాలను ఇచ్చిందన్నారు. ఇది యూపీఐటీఎస్‌ను భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య కార్యక్రమాలలో ఒకటిగా మార్చిందన్నారు. ఇప్పుడు ఇలాంటి ట్రేడ్ షోలను రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నిర్వహించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు... దీని కోసం అధికారులను కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
undefined
ఇక ఎంఎస్ఎంఈ ప్రధాన కార్యదర్శి ఆలోక్ కుమార్ మాట్లాడుతూ... యూపీఐటిఎస్ రెండు లక్ష్యాలను కలిగి ఉందన్నారు. మొదటిది చిన్న పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి వేదికను అందించడం, రెండవది మన చేతిపనులు, వంటకాలు, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం. భారతదేశంలోని చాలా బ్రాండ్‌లు ఇప్పటికే విదేశాలలో ఉన్నాయి, కానీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్ లేదు. ఈ కార్యక్రమం ద్వారా యూపీని విదేశాలకు పరిచయం చేసామన్నారు. ఇప్పుడు స్థానికంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే రాష్ట్రస్థాయిలో చేపట్టే ట్రేడ్ షో కు యూపిఐటిఎస్ మాదిరిగా అంతర్జాతీయ కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో రాకపోవచ్చు... కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల కొనుగోలుదారులు పాల్గొంటారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను ల్యాండ్ లాక్డ్ స్టేట్ కంటే ఎక్కువగా మైండ్ లాక్డ్ స్టేట్‌గా భావిస్తారని.., ఎందుకంటే మనం మన స్వంత మార్కెట్‌ను మాత్రమే చూస్తామని ఆయన అన్నారు. బాహ్య మార్కెట్లలో ఉన్న అవకాశాల కోసం ఇంకా దూకుడుగా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం వుందన్నారు. ఈ ట్రేడ్ షో ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఆలోక్ కుమార్ తెలిపారు.
ఆగ్రా, వారణాసి, లక్నోలో మూడు యూనిటీ మాల్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ కళాకారుల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు స్థలాన్ని ఇస్తామన్నారు. దీంతో పాటు బరేలీలో కూడా స్మార్ట్ సిటీ ద్వారా ఒక మాల్‌ను తీసుకున్నామని... దాంట్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇక నోయిడాలో ఇప్పటికే ఏర్పాట్లు ఉన్నాయి. ఇలా యూపీలో ప్రధానమైన 5 ప్రాంతాల్లో ట్రేడ్ షో లను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎంఎస్ఎంఈ ప్రధాన కార్యదర్శి కోరారు. తద్వారా కళాకారులు తమ ఉత్పత్తులను ఎక్కువమంది వద్దకు చేర్చే అవకాశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో రాష్ట్ర ఉత్పత్తుల కొనుగోలుకు అంతర్జాతీయ కొనుగోలుదారులు ఆసక్తి చూపారని ఎంఎస్ఎంఈ మంత్రి రాకేష్ సచాన్ తెలిపారు. సొంతంగా అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను నిర్వహించుకుంటున్న మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని అన్నారు.ట్రేడ్ షోలో ఓడీఓపీలో 350 స్టాల్‌లు ఏర్పాటు చేశారు. ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, రక్షణ, వస్త్ర పరిశ్రమ వంటి వివిధ పరిశ్రమల స్టాల్‌లు కూడా అక్కడ ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు.
చిన్న చిన్న కళాకారులకు ఇంత పెద్ద వేదిక లభించడం వల్లనే జనపనార సంచులు తయారు చేసేవారికి రూ.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. అదేవిధంగా వారణాసి గులాబీ మీనాకారికి కూడా రూ.5 కోట్ల ఆర్డర్ వచ్చిందన్నారు. ఖచ్చితంగా మన చేతివృత్తులవారు, ఎంఎస్ఎంఈలు వారి ఉత్పత్తులకు మన ప్రభుత్వం పెద్ద మార్కెట్‌ను అందించింది, దీని వల్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుస్తామనే సంకల్పం నెరవేరుతుందన్నారు.