
Uttar Pradesh Accident : ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పట్‌లో ఆదినాథుని నిర్వాణ లడ్డూ ఉత్సవానికి మంగళవారం భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో మనస్తంభ కాంప్లెక్స్ లో చెక్కవేదిక (వాచ్ టవర్) కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
ఒక్కసారిగి వాచ్ టవర్ కుప్పకూలడంతో అసలు ఏం జరిగిందో అర్థంకాక అక్కడున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు. ఈ షాక్ నుండి తేరుకునేలోపే చుట్టుపక్కల గాయాలతో పడివున్నవారు కనింపించారు... దీంతో వెంటనే అప్రమత్తమై వారిని కాపాడే ప్రయత్నంచేసినా అంబులెన్స్ లు అందుబాటులో లేవు.దీంతో ఆటో రిక్షాల్లో క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించాల్సి వచ్చింది.
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాగ్ ఫట్ జిల్లా ఎస్పీ అర్పిత్ విజయవర్గియ్ ఈ ఘటనపై స్పందించారు. జైన్ కమ్యూనిటీ నిర్వహిస్తున్న లడ్డు మహోత్సవ్ లో ప్రమాదం జరిగిందని... ఇప్పటికే పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారని తెలిపారు. తమకు అందుతున్న సమాచారం మేరకు 20 నుండి 30 మంది గాయపడ్డట్లు, వీరిలో 2 లేదా 3 ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటన దురదృష్టకరమని... గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని యోగి ఆదిత్యనాథ్ కోరుకున్నారు.