ఈ రోజు టాప్ వార్తలు ఇవే.
పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడి నుంచి?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన తన అభ్యర్థులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. పలు నియోజకవర్గాలకు 18 మంది అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నుంచి ఆయన బరిలో ఉండనున్నారు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్‌కు నో టికెట్
నర్సాపురం ఎంపీ టికెట్ కోసం రఘురామ ఎదురుచూశాడు.కానీ, బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు లేదు. శ్రీనివాస వర్మ అనే నాయకుడిని నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా తేల్చింది. ఇది జగన్ పనేనని ఆర్ఆర్ఆర్ ఆవేదన చెందారు.
తెలంగాణలో బీజేపీ మూడో జాబితా
తెలంగాణలో లోక్ సభ స్థానాలకు బీజేపీ ఈ రోజు అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది. వరంగల్ (ఎస్సీ) లోక్ సభ స్థానానికి ఆరూరి రమేశ్, ఖమ్మం స్థానానికి తాండ్ర వినోద్ రావును అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఇది వరకే బీజేపీ 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరి పేర్లను ప్రకటించింది.
బీజేపీలోకి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆదివారం నాడు బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో వరప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కరోనా మళ్లీ రావొచ్చు.. బీ అలర్ట్
కోవిడ్ -19 మహమ్మారి మళ్లీ ఎప్పుడైనా విరుచుకుపడే అవకాశం ఉందని యూకేలోని అంటువ్యాధుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని, కాకపోతే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
మోడీకి ఓటేయాలని వివాహపత్రికలో విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో తన కొడుకు పెళ్లికి పెళ్లి కొడుకు తండ్రి ప్రత్యేకమైన ఆహ్వానం పంపారు. తన కొడుకు పెళ్లికి వచ్చే వారంతా ఎలాంటి బహుమతులు తీసుకురావద్దని కోరారు. అయితే త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని వివాహా ఆహ్వాన పత్రికలో ఆయన కోరారు.
బరిలో కంగనా రనౌత్, రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్
బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, నవీన్ జిందాల్ సహా కీలక నాయకులను అభ్యర్థులుగా ఖరారు చేసింది.
ప్రధానిపై మోడీపై పోటీ చేసేదెవరంటే ?
లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 45 అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం విడుదల చేసింది. ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.