అంత్యక్రియలకు డబ్బులు లేక పాపం ఓ తల్లి

By Nagaraju TFirst Published Oct 5, 2018, 6:45 PM IST
Highlights

చనిపోయిన శిశువు అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక ఓ తల్లి ఆ మృత శిశువును జాతీయ రహదారిపై పడేసి వెళ్లిపోయింది. అప్పటికే అప్పులు చేసి పురుడుపోసుకున్న ఆమె అంత్యక్రియలకు మరింత అప్పుచెయ్యాల్సి వస్తుందన్న భయంతో మృతశిశువును రోడ్డుపై పడేసి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. 

జార్ఖండ్ : చనిపోయిన శిశువు అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక ఓ తల్లి ఆ మృత శిశువును జాతీయ రహదారిపై పడేసి వెళ్లిపోయింది. అప్పటికే అప్పులు చేసి పురుడుపోసుకున్న ఆమె అంత్యక్రియలకు మరింత అప్పుచెయ్యాల్సి వస్తుందన్న భయంతో మృతశిశువును రోడ్డుపై పడేసి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేక పేగుతెంచుకు పుట్టిన బిడ్డకు దహనసంస్కారాలు నిర్వహించలేదని ఓ తల్లి దయనీయ పరిస్థితి జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారోలో వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్‌ రాష్ట్రంలోని బొకారో జిల్లా ధన్‌బాద్‌కు చెందిన డాలీ అనే మహిళ పురిటి నొప్పులతో గత నెల 30న బొకారో జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమె ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆశిశువుకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు అక్టోబర్‌ 1న వైద్యులు ధృవీకరించారు. 

తక్షణమే చిన్నారికి శస్త్రచికిత్స చెయ్యాలని తల్లికి తెలిపారు. అయితే ఆ ఆస్పత్రిలో ఖర్చు ఎక్కువ అవుతుందని భయపడిన డాలీ పక్కనే ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆ ఆస్పత్రిలో రోజుకు 8వేల రూపాయలు ఖర్చు అవుతుండటంతో ఆమెకు పెనుభారంగా మారింది.  

చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చేసేది లేక డాలీ అనారోగ్యంగా ఉన్న శిశువుతోనే సొంతూరికి  ప్రయాణమైంది. అయితే కొద్దిదూరం వెళ్లేసరికి శిశువు కన్నుమూసింది. శిశువు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తే అంత్యక్రియల నిమిత్తం డబ్బులు ఖర్చు చెయ్యాల్సి ఉంటుందని భావించిన డాలి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేసి వెళ్లిపోయింది. 

రోడ్డుపక్కన మృతశిశువు కవర్ లో చుట్టి ఉండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహం కవర్‌పై ఉన్న ఆసుపత్రి లోగో ఆధారంగా వివరాలు సేకరించారు. తల్లి డాలీని అదుపులోకి తీసుకుని విచారించారు. 

అంత్యక్రియలకు డబ్బులు లేని కారణంగానే శిశవు మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేశానని డాలీ పోలీసులకు తెలిపింది. కాన్పు నిమిత్తం ఇప్పటికే చాలా ఖర్చు చెయ్యాల్సి వచ్చిందని ఇక అప్పులు చెయ్యలేక ఇలా చేశానని బోరున విలపించింది. 

click me!