Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో సోనియా గాంధీ ఆస్తులు ఇవే.. వైసీపీ ఏడో జాబితా విడుదల.. రేవంత్ రెడ్డి జైలుకు ఖాయం, కేజ్రీవాల్ కు భారీ షాకిచ్చిన గుజరాత్ హైకోర్టు ,రూ. 115 కోట్లు ఫ్రీజ్: ఐటీ శాఖపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, విద్యుత్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి.., ఎన్నారైతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి, మాతో టచ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు: బండి సంజయ్ సంచలనం, బీఆర్ఎస్ కు బిగ్ షాక్..కాంగ్రెస్‌లో చేరిక అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, చంద్రబాబు మెడకు మరో ఉచ్చు, ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం, రాజధాని ఫైల్స్ కు లైన్ క్లియర్ ... విడుదలకు ఓకే చెప్పిన ఏపి హైకోర్టు , చంద్రబాబు ఇంట రాజశ్యామల యాగం వంటి వార్తల సమాహారం.
Today's Top Stories:
ఎన్నారైతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
Law Commission: ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) లేదా ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా)తో వివాహానికి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఆర్‌ఐలు/ఓసీఐలు, భారత పౌరుల మధ్య వివాహాల్లో జరిగే మోసాలకు సంబంధించి సమగ్ర చట్టాన్ని రూపొందించాలని లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి జస్టిస్ (రిటైర్డ్) రీతూ రాజ్ అవస్థి నేతృత్వంలోని ప్యానెల్ ఒక నివేదికను సమర్పించింది. దీనితో పాటు ఈ వివాహాలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాలని న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది.ఎన్‌ఆర్‌ఐలు, భారతీయ సంతతికి చెందిన విదేశీ పౌరుల మధ్య ఒకవైపు, మరోవైపు భారతీయ పౌరుల మధ్య దేశాంతర వివాహాల వల్ల తలెత్తే చట్టపరమైన సమస్యలు గణనీయంగా పెరిగాయని కమిషన్ పేర్కొంది.
కేజ్రీవాల్ కు భారీ షాకిచ్చిన గుజరాత్ హైకోర్టు
PM Modi degree row: ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్, పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను చట్టవిరుద్ధమని సవాల్ చేశారు. కానీ, ప్రధాని మోడీ విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు కోర్టు నుంచి ఊరట లభించలేదు. క్రిమినల్, పరువు నష్టం కేసులో ఇరువురు నేతల అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ అహ్మదాబాద్ కోర్టు పిలిచినప్పుడు హాజరుకావలసి ఉంటుంది.
రూ. 115 కోట్లు ఫ్రీజ్: ఐటీ శాఖపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్
ఆదాయ పన్ను శాఖ తమ బ్యాంకు ఖాతాలను స్థంభింపజేసిందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ న్యూఢిల్లీలో శుక్రవారంనాడు మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలు స్థంభింపజేయబడ్డాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ముగిసిపోయిందని ఆయన విమర్శించారు. యూత్ కాంగ్రెస్ కు చెందిన బ్యాంకు ఖాతాలను స్థంభింపజేసినట్టుగా తెలిసిందన్నారు. ఈ విషయమై అజయ్ మాకెన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యూత్ కాంగ్రెస్ , కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ. 210 కోట్ల రికవరీని ఐటీ శాఖ కోరిందని అజయ్ మాకెన్ చెప్పారు. క్రౌడ్ ఫండింగ్ డబ్బును ఐటీ శాఖ స్థంభింపజేసిందని ఆయన చెప్పారు.
Sonia Gandhi: సోనియా గాంధీ ఆస్తుల లెక్కలు ఇవే..
Sonia Gandhi: సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల వివరాలను నమోదు చేశారు. తన వద్ద రూ. 12.53 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. ఇటలీలో తన తండ్రి వారసత్వంగా రూ. 27 లక్షల షేర్ ఉన్నట్టు వివరించారు. వీటితోపాటు 88 కిలోల వెండి, 1,267 గ్రాముల బంగారం, స్వర్ణ ఆభరణాలు ఉన్నట్టు వెల్లడించారు. న్యూఢిల్లీలోని దేరా మండి గ్రామంలో మూడు బిగాల సాగు భూమి ఆమె పేరిట ఉన్నట్టు తెలిపారు. ఆమె ఆదాయం ఎంపీగా పొందుతున్న జీతాన్ని, రాయల్టీ ఇన్‌కమ్, క్యాపిటల్ గెయిన్స్ వంటి వాటిని పేర్కొన్నారు. కాగా, తన వద్ద రూ. 90 వేల నగదు ఉన్నట్టు తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.
విద్యుత్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి..
Free current: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులెస్తుంది. ఇప్పటికి రెండు పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. తాజాగా మరో పథకం అమలు దిశగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ పథకమే గృహ జ్యోతి (Gruha Jyothi Scheme). రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాలనే ఉద్దేశించిన పథకం ఇది. 200లు లేదా అంతకంటే తక్కువ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే వారికి ఉచితంగా విద్యుత్ అందజేయనున్నది. ఈ మేరకు గృహ జ్యోతి పథకం అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను కాంగ్రెస్ సర్కార్ జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
మాతో టచ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు: బండి సంజయ్ సంచలనం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పారు. శుక్రవారం నాడు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు తమ పార్టీతో టచ్ లోకి వచ్చారని ఆయన చెప్పారు.పార్లమెంట్ ఎన్నికలను తమ పార్టీ సీరియస్ గా తీసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి మెరుగైన సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి జైలుకు ఖాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy: లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాక సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వార్తల్లోకి ఎక్కాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష సీఎం పదవికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నదని అన్నారు. అధికారానికి వచ్చాం కదా.. అని గత ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ కు బిగ్ షాక్..కాంగ్రెస్‌లో చేరిక అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి శుక్రవారంనాడు చేరారు. పట్నం సునీతా మహేందర్ రెడ్డితో పాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ పార్టీ కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం
Bird flu; ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఇటీవల నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు వాటి శాంపిల్స్ ను భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపగా.. అవి చనిపోవడానికి కారణం ఎవిఎఎన్ ఇన్‌ఫ్లూయెంజా అని నిర్ధారణ అయింది. దీంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అప్రమత్తం చేశారు. కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చంద్రబాబు మెడకు మరో ఉచ్చు
AP Fibernet Scam : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ శుక్రవారం (ఫిబ్రవరి 16) చార్జ్‌షీట్ దాఖలు చేసింది.స్కామ్‌లో నిందితులుగా ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశివరావును పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు సీఐడీ పేర్కొంది. మొత్తం రూ. 2000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ. 330 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది.
YSRCP 7th List: వైసీపీ ఏడో జాబితా విడుదల.. అభ్యర్థులు వీరే..
YSRCP 7th List: ఏపీలో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అటూ అధికార వైసీపీ, ఇటూ ప్రతి పక్ష బీజేపీ, జనసేన, టీడీపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్సీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తన పార్టీలో ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు జాబితాలు ప్రకటించిన వైసీపీ.. తాజాగా శుక్రవారం రాత్రి ఏడో జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎడం బాలాజీని, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్‌ను పార్టీ సమన్వయ కర్తలుగా అధిష్టానం నియమించింది.
చంద్రబాబు ఇంట రాజశ్యామల యాగం
ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దైవ అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇవాళ(శుక్రవారం) ఉండవల్లిలోని ఆయన నివాసంలో రాజశ్యామల యాగం మొదలయ్యింది. ఈ యాగ క్రతుల్లో చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు ఈ రాజశ్యామల యాగం జరగనుంది.
రాజధాని ఫైల్స్ కు లైన్ క్లియర్ ... విడుదలకు ఓకే చెప్పిన ఏపి హైకోర్టు
అమరావతి : ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ లో సినీ రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీ ప్రజలపై సినిమాల ప్రభావం ఎక్కువగా వుంటుంది... ఇది గ్రహించిన ప్రధాన పార్టీలు ఈ సినిమాలనే రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన 'రాజధాని ఫైల్స్' మూవీ రిలీజ్ పై ఏపీలో వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. నిన్న(గురువారం) విడుదలైన ఈ మూవీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ప్రదర్శింపబడలేదు. ఈ సినిమాపై వైసిపి నాయకులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఏపీలో విడుదలను అడ్డుకుంటూ హైకోర్టు స్టే విధించింది.