
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం లోకసభలో చర్చకు రానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికపై అవిశ్వాస తీర్మానంపై మాట్లాడారు.
మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది ముఖ్యమైన రోజు అని ఆయన అన్నారు. ఈ సందర్భానికి తగిన విధంగా తన సహచర సభ్యులు సిద్ధంగా ఉంటారని భావిస్తున్నానని, నిర్మాణాత్మకమైన, సమగ్రమైన, సజావుగా చర్చ జరిగేలా చూస్తారని తనకు విశ్వాసం ఉందని అన్నారు.
ఆ విధంగా చేస్తామని ప్రజలకు, రాజ్యాంగ నిర్మాతలకు నమ్మకం కలిగిద్దామని ఆయన అన్నారు. భారతదేశం యావత్తూ జాగ్రత్తగా గమనిస్తోందని అన్నారు.